- వాటిని హ్యాండ్ లగేజీలోనేక్యారీ చేయాలి
- ఎట్టి పరిస్థితుల్లోనూ చార్జింగ్ పెట్టరాదు: డీజీసీఏ
- అగ్నిప్రమాదాల నివారణకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: విమానాల్లో అగ్నిప్రమాదాల నివారణకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విమానాల్లో పవర్ బ్యాంకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదని ప్రయాణికులకు సూచించింది. అంతేకాకుండా వాటిని హ్యాండ్ లగేజీలోనే క్యారీ చేయాలని, సీట్లపై ఉండే కంపార్ట్ మెంట్లలో (ఓవర్ హెడ్ కంపార్ట్ మెంట్లు) పవర్ బ్యాంకులను ఉంచరాదని స్పష్టం చేసింది. విమానాల్లో పవర్ బ్యాంకుల వాడకం వల్ల తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణ కోసమే కొత్త మార్గదర్శకాలు విడుదల చేశామని డీజీసీఏ తెలిపింది. ‘‘లిథియం బ్యాటరీల మంటలు చాలా ప్రమాదకరం. అవి చాలా శక్తివంతమైనవి. లిథియం బ్యాటరీ ఫోన్లకు పవర్ బ్యాంకులను ఓవర్ హెడ్ కంపార్ట్ మెంట్లలో చార్జింగ్ కు ఉంచినపుడు మంటలు అంటుకుంటే.. గుర్తించడం ఆలస్యం కావొచ్చు. దీనివల్ల ప్రమాద తీవ్రత పెరుగుతుంది. ఇటీవలి కాలంలో విమానాల్లో పవర్ బ్యాంకుల వాడకం పెరిగిపోయింది. దీంతో అగ్నిప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఓవర్ చార్జింగ్, బ్యాటరీ అతిగా వేడెక్కడం, ఎక్స్ పైర్డ్ బ్యాటరీలకు, డ్యామేజ్ అయిన బ్యాటరీలకు పవర్ బ్యాంక్ వాడడం చాలా ప్రమాదకరం’’ అని డీజీసీఏ వివరించింది. తాజాగా విడుదల చేసిన గైడ్ లైన్స్ గురించి విమానయాన సంస్థలు ప్రయాణికులకు తెలియజేయాలని, విమానాల్లో పవర్ బ్యాంకులు వాడకూడదని డిస్ ప్లే బోర్డులపై ప్రదర్శించాలని డీజీసీఏ సూచించింది.
