అమెరికాలో విమాన సర్వీసులకు అంతరాయం

అమెరికాలో విమాన సర్వీసులకు అంతరాయం

వాషింగ్టన్‌ : అమెరికా (USA)లో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. ఫెడరల్‌ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ (FAA)లో సాంకేతిక లోపం కారణంగా అమెరికా అంతటా సేవలు నిలిచిపోయాయి. దీంతో విమానాలన్నీ  ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల  గురించి విమాన సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేసేందుకు ఎఫ్‌ఏఏ.. ఎయిర్‌లైన్లకు ఇచ్చే నోటమ్‌ (నోటీస్‌ టు ఎయిర్‌ మిషన్స్‌) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఎఫ్‌ఏఏ ట్విటర్‌లో వెల్లడించింది. దీన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

సాంకేతిక సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపింది. సాంకేతిక సమస్య కారణంగా నేషనల్‌ ఎయిర్‌స్పేస్‌ వ్యవస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగినట్లు వెల్లడించింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయానికి దేశవ్యాప్తంగా 400లకు పైగా విమానాల రాకపోకలకు ఆటంకం కలిగినట్లు ఫ్లైట్‌ అవేర్‌ డేటా వెల్లడించింది. అమెరికాలో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఆన్‌లైన్ ఫ్లైట్ ట్రాకర్ FlightAware ప్రకారం.. అమెరికాలో దాదాపు 1,230 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఎయిర్‌మిషన్స్‌ సిస్టమ్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ఎఫ్‌ఏఏ పని చేస్తోందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)లో తలెత్తిన సాంకేతిక లోపం పరిస్థితులను అమెరికా రవాణాశాఖ మంత్రి  ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు వివరించారని శ్వేత సౌధం వెల్లడించింది. సైబర్‌ దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అయితే, దీని వెనుక కారణాలపై పూర్తి విచారణ జరపాలని ఆదేశించినట్టు శ్వేత సౌధం ప్రెస్‌ కార్యదర్శి ట్విటర్‌లో తెలిపారు.