ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఈకామర్స్ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా.. సరికొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మద్దతు ఉన్న ఫ్లిప్‌కార్ట్ బెంగళూరులో'ఈట్ ఇన్' పేరుతో ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను ట్రయల్స్ వేస్తోంది. ప్రస్తుతం ఈ సేవలను అంతర్గతంగా పరీక్షిస్తున్న సంస్థ.. త్వరలోనే బెంగళూరు నగర వాసులకు విస్తరించాలని ప్లాన్ సిద్ధం చేసింది.
ప్రస్తుతం మన దేశంలో ఫుడ్ డెలివరీ మార్కెట్‌ను జొమాటో, స్విగ్గీ సంస్థలు ఆధిపత్యంలోనే ఉన్నాయి. అయితే ఈ రంగానికి ఇప్పుడు పోటీ మరింత పెరిగింది. రాపిడో సంస్థ 'ఓన్లీ' పేరుతో జీరో కమిషన్ మోడల్‌ను తెచ్చి రోజుకు 50 వేలకు పైగా ఆర్డర్లను సాధిస్తోంది. అలాగే స్విగ్గీ కూడా తక్కువ బడ్జెట్ వినియోగదారుల కోసం 'టోయింగ్' అనే కొత్త యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చి సంచలనం సృష్టిస్తోంది. జొమాటో మాత్రం ప్రత్యేక యాప్‌కు బదులుగా తన ప్లాట్‌ఫారమ్‌లోనే చౌకైన ఆఫర్లతో పాటు 'బిస్ట్రో' అనే సరికొత్త మోడల్‌పై దృష్టి పెట్టింది.
ఈ తీవ్రమైన పోటీ నడుమ ఫ్లిప్‌కార్ట్ ONDC సహాయంతో 'ఈట్ ఇన్' యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. కేవలం తక్కువ ధరలకే పరిమితం కాకుండా.. రెస్టారెంట్లకు తక్కువ కమిషన్లు, వినియోగదారులకు అద్భుతమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి గతంలో తెలిపారు. కేవలం ధరల యుద్ధంలోనే కాకుండా.. సర్వీస్, రిలయబిలిటీ పరంగా కూడా కస్టమర్లను ఆకట్టుకోవాలని సంస్థ భావిస్తోంది.
ALSO READ : ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా..
మార్కెట్లో ఉన్న దిగ్గజాలకు దీటుగా నిలబడాలంటే ఈ ఉద్యోగుల ట్రయల్ రన్ ఫ్లిప్‌కార్ట్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. సర్వీస్‌లో ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకోవడానికి ఇది చక్కని అవకాశం. త్వరలోనే సామాన్య వినియోగదారులకు కూడా ఈ సేవలు అందుబాటులోకి రానుండటంతో.. రాబోయే రోజుల్లో ఫుడ్ డెలివరీ మార్కెట్ మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
