భారత ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో మరో భారీ పోటీకి తెరలేవనుంది. ఈ-కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ రంగంలో జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్, మెరుగైన సేవలు, కొత్త ఆఫర్లను తెచ్చిపెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రాబోయే కొద్ది వారాల్లో కంపెనీ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనుందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి వెల్లడించారు. అయితే దేశవ్యాప్తంగా ఒకేసారి కాకుండా మొదట ఒకే నగరంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సేవలను అందించనుంది. వినియోగదారుల స్పందన, సేవల పనితీరు, వ్యాపార నమూనాపై వచ్చిన అభిప్రాయాలను పరిశీలించిన తర్వాతే ఇతర నగరాలకు విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం కంపెనీ బెంగళూరు నగరాన్ని ఎంచుకుందని సమాచారం.
ఈ సేవను ఫ్లిప్‌కార్ట్ ప్రధాన యాప్‌తో పాటు ప్రత్యేక ఇంటర్‌ఫేస్ సహాయంతో అందించేలా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతంలో ప్రారంభించిన "ఫ్లిప్‌కార్ట్ మినిట్స్" క్విక్ కామర్స్ సేవను కూడా ఇదే తరహాలో మొదట పరిమిత స్థాయిలో పరీక్షించి.. ఆ తర్వాత వేగంగా విస్తరించిన విషయాన్ని కళ్యాణ్ కృష్ణమూర్తి గుర్తుచేశారు. కస్టమర్లకు సరైన విలువను అందించే ఉత్పత్తిని రూపొందించడం తమ తొలి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.
ధరల పోటీతో మాత్రమే కాకుండా కొత్త ఆవిష్కరణలు, మెరుగైన వినియోగదారుల అనుభవం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందడమే తమ లక్ష్యమని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లు, మెరుగైన సేవలను అందిస్తూ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవాలని సంస్థ భావిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ నిర్ణయంతో ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న జొమాటో, స్విగ్గీకి గట్టి సవాలు ఎదురుకానుంది. కంపెనీ ప్రకటన వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో స్విగ్గీ షేర్లు 5 శాతానికి పైగా, ఎటర్నల్ షేర్లు 3 శాతం పడిపోవడం ఈ పరిణామం ప్రభావాన్ని స్పష్టంగా చూపించింది.
ALSO READ : ట్రంప్ టారిఫ్స్ దెబ్బ.. కుప్పకూలిన మన స్టాక్ మార్కెట్స్
ఇక ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ సేవకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. క్విక్ కామర్స్‌ను ప్రత్యేక వ్యాపారంగా కాకుండా.. తమ ఈ-కామర్స్ వ్యాపారంలో మరో ముఖ్యమైన విభాగంగా మాత్రమే చూస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ రంగంలో ఆరు లేదా ఏడు సంస్థలు నిలదొక్కుకోవడం కష్టమని అభిప్రాయపడిన ఆయన.. ప్రస్తుతం ఇతర సంస్థలను కొనుగోలు చేసి విస్తరించే ఆలోచన మాత్రం ఫ్లిప్‌కార్ట్‌కు లేదని స్పష్టం చేశారు. దీంతో భారత ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
