సిటీ జలాశయాలకు వరద కంటిన్యూ

సిటీ జలాశయాలకు వరద కంటిన్యూ
  • గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

హైదరాబాద్: జంట నగరాలు.. పరిసర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. జలాశయాలకు వరద కొనసాగుతోంది. సిటీ పరిధిలో ప్రధాన జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు నిన్నటి స్థాయిలోనే స్వల్ప వరద కొనసాగుతోంది. ఈ జలాశయాలు గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీటి విడుదలను కంటిన్యూ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అంటే రాత్రి 8 గంటల సమయానికి నీటిపారుదల శాఖ విడుదల చేసిన బులెటిన్  మేరకు ఉస్మాన్ సాగర్ కు 400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు రెండు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 408 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ గరిష్ట నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1786.30 అడుగులు ఉంది. నీటి సామర్థ్యం 3.900 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 3.071 టీఎంసీల నీటి నిల్వ కొనసాగిస్తున్నారు.  ఉంది. 
అలాగే హిమాయత్ సాగర్ వరద పరిస్థితి కూడా నిన్నటి పరిస్థితే కొనసాగుతోంది. 
హిమాయత్ సాగర్ కు 200 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా.. అధికారులు 170 క్యూసెక్కుల నీటిని ఒక గేటు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు, నీటి సామర్థ్యం 2.970 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1760.60 అడుగులతో 2.378 టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తూ.. ఒక గేటును ఎత్తి 170 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకుని నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 513.45 అడుగులు ఉండగా..ప్రస్తుతం 513.41 అడుగుల నీటిమట్టం ఉంది.