- నారాయణపూర్ నుంచి ప్రాజెక్ట్‌కు 33 వేల క్యూసెక్కులు
- సీజన్‌లో తొలిసారి ప్రాజెక్ట్‌కు ఫ్లడ్
- ఆల్మట్టికి 84 వేల క్యూసెక్కులు.. 50 వేల క్యూసెక్కులు విడుదల
- నారాయణపూర్‌కు 52,370 క్యూసెక్కుల వరద.. దిగువకు 37 వేలు రిలీజ్
- కృష్ణా క్యాచ్‌మెంట్‌లో క్రమంగా పెరుగుతున్న నదీ ప్రవాహం
- గోదావరి బేసిన్‌లోని లోయర్ గోదావరిలోనూ పెరిగిన వరద
హైదరాబాద్/గద్వాల/భద్రాచలం, వెలుగు: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఎట్టకేలకు వరద మొదలవుతున్నది. నిరుడు జూన్ రెండో వారంలోనే జూరాలకు వరదలు ప్రారంభం కాగా.. ఇప్పుడు లేటుగా జులై చివరి వారంలో ప్రాజెక్టుకు ఫ్లడ్ ఇన్‌ఫ్లో వచ్చింది. మహారాష్ట్ర, పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు పడుతుండడంతో ఎగువన కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు దాదాపు నిండిపోయాయి.
కృష్ణాతోపాటు తుంగభద్రలోనూ వరద ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. కృష్ణా బేసిన్‌లో అత్యంత కీలకమైన భారీ ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్ పూర్తి జలకళను సంతరించుకున్నాయి. ఎగువ నుంచి ఇంకా వరదలు పెరిగే అవకాశం ఉందన్నఅంచనాలతో ఆ రెండు ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు వరద ప్రవాహాలు వచ్చి చేరాయి.
ఆల్మట్టికి ఫ్లడ్ ఇన్‌ఫ్లో పెరగడంతో రెండు రోజుల క్రితమే ఆ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు 84 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. దిగువకు 50 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి సామర్థ్యం 129.72 టీఎంసీలైతే.. ప్రస్తుతం 115.56 టీఎంసీలకు చేరింది. దీంతో నారాయణపూర్ ప్రాజెక్ట్ కూడా పూర్తిస్థాయికి చేరుకున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 37.22 టీఎంసీలకు చేరింది. ఆ ప్రాజెక్టుకు ప్రస్తుతం 52,370 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. దిగువకు పదిగేట్ల ద్వారా 37 వేల క్యూసెక్కులను రిలీజ్చేశారు.
ప్రస్తుతం జూరాలకు రియలైజ్డ్ ఇన్‌ఫ్లో 33,900 వేల క్యూసెక్కులుగా నమోదవుతున్నది. ఇటు మహారాష్ట్రలోని ఉజ్జని నదికి కూడా 63 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ఆ ప్రాజెక్టు కూడా రెండు మూడు రోజుల్లో నిండే అవకాశం ఉన్నది. ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే భీమాకు వరద నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇటు గోదావరిలోనూ వరదలు పెరుగుతున్నాయి. జైక్వాడికి 80 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. కాగా, జూరాలకు వరద పెరిగితే.. వచ్చే నెలలో నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి.
లోయర్ గోదావరిలో వరదలు..
ఎగువ గోదావరిలో ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పడుతున్నా.. లోయర్ గోదావరిలో మాత్రం ప్రవాహాలు పెరుగుతున్నాయి. ప్రాణహిత నది నుంచి వరదలు వస్తుండడంతో దిగువన గోదావరి నది ప్రవాహ మట్టం పెరుగుతున్నది. ప్రాణహిత నుంచి వస్తున్న వరదలతో కాళేశ్వరంలోని మేడిగడ్డ వద్ద 1.21 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ ఇన్‌ఫ్లో వస్తున్నది. నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) బ్యారేజీ సేఫ్టీ దృష్ట్యా గేట్లను ఎత్తిపెట్టాలని చెప్పడంతో.. దానిని ఓపెన్ స్టేట్‌లోనే పెట్టారు. దీంతో దిగువన ఏటూరు నాగారం, దుమ్ముగూడెం, భద్రాచలం వద్ద నదీ ప్రవాహం పెరుగుతున్నది.
ఏటూరు నాగారం వద్ద వార్నింగ్ లెవెల్ 73 మీటర్లు కాగా.. ప్రస్తుతం అక్కడ 69 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం ఉన్నది. ప్రాణహితకు నదీ ప్రవాహం ఇంకా కొనసాగే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే, ఎగువన చెప్పుకోదగిన స్థాయిలో వరదలు రాకపోతుండడంతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదల కోసం ఇంకా ఎదురుచూపులు తప్పేలా కనిపించడం లేదు. ఆగస్టు చివరినాటికైనా ఆ ప్రాజెక్టుకు వరదలు వస్తాయా? అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
10 రోజుల్లో మరింత వరద!
గోదావరి నదికి వరద స్వల్పంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఆదివారం సాయంత్రం 4 గంటలకు గోదావరి నీటిమట్టం 17.5 అడుగులుగా నమోదైంది. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు పడడంతో గోదావరికి మరో 10 రోజుల్లో మరింత ఫ్లడ్ ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఈ ఏడాది గోదావరికి పెద్దగా వరద రాలేదు. ప్రస్తుత నీటిమట్టమే ఈ ఏడాది ఇప్పటివరకు గరిష్టం కావడం గమనార్హం.
బేసిన్లలో పెరుగుతున్న వరదలు
కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని క్యాచ్‌మెంట్ ఏరియాల్లో వరద ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని అర్జునవా డలో వార్నింగ్ స్థాయికి అతి చేరువలో కృష్ణా నది ప్రవహిస్తున్నది. అక్కడ వరద ప్రవాహ ఎత్తు క్రమంగా పెరుగుతున్నది. కర్నాటకలోని కలబురిగిలో భీమా నది కూడా 394 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. అక్కడ నది ప్రవాహం స్టడీగా ఉంది. తుంగభద్ర నదిలోనూ ప్రవాహం స్థాయిలు పెరుగుతున్నాయి.
కృష్ణాలో అత్యంత కీలకమైన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల వద్ద వరద పెరుగుతున్నదని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) రిపోర్ట్ స్పష్టం చేసింది. అదే సమయంలో గోదావరికి అత్యంత కీలకమైన నాసిక్‌లోనూ వరద ప్రవాహం రెండు మూడు రోజులుగా రైజింగ్‌లో ఉండగా.. ప్రస్తుతం నదీ ప్రవాహం కాస్త తగ్గినట్టు సీడబ్ల్యూసీ రిపోర్ట్ వెల్లడించింది.
