
హైదరాబాద్ రెస్టారెంట్లు.. జొమాటో, స్విగ్గీల్లో చూసి ఆహోఓహో అనుకుంటాం.. కలర్ ఫుల్ బోర్డులతో లొట్టలేసుకుని తినాలన్నట్లు పబ్లిసిటీ ప్రచారం ఉంటుంది.. ఇక ఇన్ఫూయెన్సర్ల రివ్యూలు చూస్తే ఆఫీసు నుంచి ఇంటికి వెళుతూ తినాలి అన్నట్లు ఉంటాయి.. ఇదంతా పైన పటారమే.. ఒక్కసారి ఆ రెస్టారెంట్లలోని కిచెన్ లోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది.. యాక్.. థూ.. ఇంత దారుణంగా ఉన్నాయా మన హైదరాబాద్ సిటీలోని రెస్టారెంట్లు అంటారు.. ఇదంతా మేం అనటం కాదండీ.. ఫుడ్ సేఫ్టీ అధికారులు.. 2025, ఆగస్ట్ 12వ తేదీ సిటీలోని 25 టాప్ రెస్టారెంట్లను తనిఖీ చేస్తే.. అందులో 23 రెస్టారెంట్లలో శాంపిల్స్ కలెక్ట్ చేశారు.. అంతేనా ఆయా రెస్టారెంట్లలోని కిచెన్.. వంట గదులు చూసి అవాక్కయ్యారు.. ఛీ.. ఏంటీ ఇలా ఉన్నాయి అంటూ ఓనర్లకు చివాట్లు పెట్టారు.. ఈ పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటైన పిస్తా హౌజ్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం 25 పిస్తా హౌజ్ బ్రాంచ్‌లలో అధికారులు తనిఖీలు చేసి, వాటిలో 23 చోట్ల శాంపిల్స్ సేకరించారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు.
తనిఖీల్లో వెల్లడైన నిజాలు..
అధికారులు జరిపిన తనిఖీల్లో అనేక తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. కిచెన్ పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు, ఈగలు తిరుగుతున్నట్లు నిర్ధారించారు. నాన్-వెజ్ వంటకాల్లో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తేల్చారు. నాన్-వెజ్ ఆహారాన్ని తుప్పు పట్టిన ఫ్రిడ్జ్‌లలో నిల్వ చేయడంతో పాటు, కూరగాయలను కూడా తుప్పు పట్టిన కత్తులతో కట్ చేస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు.
►ALSO READ | అత్యాచారం కేసులో కోర్టు తీర్పు..టాయ్ లెట్ కు అని వెళ్లి నిందితుడు పరార్
ఈ ఉల్లంఘనలపై అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల వల్ల నగరవాసుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది.