తిరుపతిలో నాన్ వెజ్ తినేటప్పుడు జాగ్రత్త.. మార్కెట్లలోనే కుళ్లిన చేపలు, రొయ్యలు

తిరుపతిలో నాన్ వెజ్ తినేటప్పుడు జాగ్రత్త.. మార్కెట్లలోనే కుళ్లిన చేపలు, రొయ్యలు

తిరుపతిలో నాన్ వెజ్ తినేవారికి ఇదైతే షాకింగ్ న్యూసే. నగర పాలక సంస్థ హెల్త్ ఆఫీసర్స్ నిర్వహించిన తనిఖీల్లో బయటపడిన విషయాలు చూస్తు ఓ సారి ఆలోచించాల్సిన పరిస్థితి. గురువారం (జూన్ 18) ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్ లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 

సిటీలో చేపల మార్కెట్లో రెండు చేపల దుకాణాలను సీజ్  చేశారు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ . దుకాణంలో కుళ్ళిపోయి దుర్వాసనవస్తున్న  చేపలు, రొయ్యలను నిల్వ చేస్తున్నారని.. వీటితో చేసిన ఆహారం తింటే అనారోగ్యం పాలు కాక తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సూచనలతో, కమిషనర్ ఆదేశాల మేరకు లీలా మహల్ వద్ద గల చేపల మార్కెట్ లో  వెటర్నరీ ఆఫీసర్,  పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. 

తిరుపతిలోని లీలామహల్ వద్ద ఉన్న చేపల మార్కెట్ లో 22 షాపులు ఉన్నాయి.  ఇక్కడ కుళ్ళిన చేపలు విక్రాయిస్తున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. చేపలు, రొయ్యలను ఫ్రీజర్లలో ఉంచి విక్రాయిస్తున్నారని తెలపడంతో తనిఖీ లు నిర్వహించామని తెలిపారు.  

షాప్ నంబర్ 9, నెం.10 షాపులలో  చెడిపోయిన నిల్వ ఉంచిన చేపలను, రొయ్యలను గుర్తించామని తెలిపారు. ఫ్రీజర్ కి మూతలు లేకుండా సరియైన పద్ధతిలో నిలువ చేయకపోవడం వలన అందులోని చేపలన్ని పురుగులు పట్టి దుర్వాసన వస్తోందని తెలిపారు. ఆ రెండు షాపులలో నిల్వ  ఉన్నటువంటి చేపలను తీయించి వాటిపై క్రిమిసంహారకాలను చల్లించి, మున్సిపల్ వాహనంలో డంపింగ్ యార్దుకు తరలించామని తెలిపారు. 

మున్సిపల్ కార్పొరేషన్  చట్టంలోని సెక్షన్ 492 నుంచి 498 వరకు 521 సెక్షన్ 541 నుంచి 546 వరకు, 622సెక్షన్ లను అనుసరించి  సదరు 9,10 షాపులకు ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసి సీజ్ చేశామని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రతను, నిబంధనలను పాటించాలని ఈ సందర్భంగా  మిగిలిన 20 షాపులకు హెచ్చరికలు జారీ చేశారు.  ఈ తనిఖీల్లో వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ గుణశేఖర్, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.