
సీఎం కేసీఆర్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కోసం అవసరమైతే తాను రాజీనామా చేస్తానంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల నుంచి కవితను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ కవిత ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే జగిత్యాల నుంచే పోటీ చేయమని కోరతానని సంజయ్ స్పష్టం చేశారు. అయితే కవిత పోటీపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు సంజయ్.
సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కవిత పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్… కవితపై విజయం సాధించారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కుమార్తె ఓటమిపాలవడం చర్చనీయాంశంగా మారడంతో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తారనే ప్రచారం జరుగుతోంది.
హుజూర్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఈ సారి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కవిత పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే తాను హుజూర్‌నగర్ నుంచి పోటీ చేయట్లేదని కవిత స్పష్టం చేశారు.