అమర జవాను అంతిమయాత్రకు.. 10 వేల మంది, 12కిలోమీటర్లు

అమర జవాను అంతిమయాత్రకు.. 10 వేల మంది, 12కిలోమీటర్లు
  • అమర జవాను అంతిమయాత్రకు.. 10 వేల మంది, 12కిలోమీటర్లు
  • తుదివీడ్కోలుకు కదిలొచ్చిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలు
  • ఇచ్చోడ నుంచి నర్సాపూర్ దాకా అంతిమ యాత్ర

ఇచ్చోడ, వెలుగు: దేశ సేవ చేస్తూ ప్రాణం విడిచిన ఆ జవానుకు ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా మొత్తం కదిలొచ్చి మరీ అంత్యక్రియల్లో పాల్గొంది. 12 కిలోమీటర్ల దూరం సాగిన అంతిమయాత్రకు చుట్టుపక్కల ఊర్ల నుంచి10 వేల మందికి పైగా తరలివచ్చి తుది వీడ్కోలు పలికారు. మహిళలు ఊరూరా ముగ్గులేసి, పూలుజల్లి శవయాత్రకు స్వాగతం పలుకుతూ, వీడ్కోలు చెబుతూ కన్నీటీ పర్యంతమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ కు చెందిన కేంద్రె సంజీవ్ తొమ్మిదేళ్లుగా ఆర్మీలో హవాల్దార్ గా చేస్తున్నాడు. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా దక్షిణ సుడాన్ లో మెడికల్ వింగ్ లో పని చేస్తూ ఈ నెల 9న గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని మంగళవారం ఇచ్చోడ తీసుకొచ్చి స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్లో భద్రపరిచారు.

అంత్యక్రియల కోసం బుధవారం ఉదయం అక్కడ్నుంచి నర్సాపూర్ కు తరలించారు. జవాను మరణ వార్త తెలిసి జిల్లా నలువైపుల నుంచీ జనం భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా రావడంతో తరలింపు పెద్ద ఊరేగింపును తలపించింది. వందేమాతరం, జై జవాన్,​ కేంద్రె సంజీవ్ అమర్​హై నినాదాలతో దారంతా మారుమోగింది. మేడిగూడలో స్టూడెంట్లు పెద్ద సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలిపారు. భారీ జనం నడుమ శవయాత్ర జవాను ఇంటికి చేరింది. ఆయన్ను కడసారి చూసుకుంటూ భార్య శీతల్, తల్లితండ్రులు కేంద్రె వినాయక్, ఊర్మిళ కన్నీరు మున్నీరయ్యారు. నర్సాపూర్ గవర్నమెంట్ స్కూల్ వెనక ఆర్మీ ,పోలీసు లాంఛనాలతో వేల మంది అశ్రునివాళుల నడుమ అంత్యక్రియలు జరిపారు. సూడాన్​ నుంచి వచ్చిన పీస్ కీపింగ్ యూనిట్ మేజర్ ఎస్ఎస్​రే డిమాన్​తో పాటు లోకల్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ నివాళులర్పించారు.