థ్రిల్లింగ్ కోసమేనట..! బ్రిటన్​లో ఏడుగురు పసిపిల్లల్ని చంపిన నర్సు

థ్రిల్లింగ్ కోసమేనట..! బ్రిటన్​లో ఏడుగురు పసిపిల్లల్ని చంపిన నర్సు
  • కిల్లర్ నర్స్ ను దోషిగా తేల్చిన కోర్టు.. రేపు శిక్ష ఖరారు
  • ఆమెను దోషిగా తేల్చడంలో భారత సంతతి డాక్టర్ కీలకం

లండన్: పుట్టిన వెంటనే పసిబిడ్డలకు ఏదైనా ఇబ్బంది వస్తే.. వారిని కాపాడేందుకు, కంటికి రెప్పలా చూసుకునేందుకు ట్రెయినింగ్ తీసుకున్న నర్సు ఆమె. కానీ, కాపాడటం అటుంచి.. వారి ప్రాణాలతోనే చెలగాటం ఆడింది. థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ కోసమని సైకోగా మారిపోయి, ఏడుగురు శిశువులను చంపేసింది. మరో ఆరుగురు చిన్నారులను చంపేందుకూ ప్రయత్నించింది. ఎంతో నమ్మకంతో పేరెంట్స్, డాక్టర్లు, తోటి నర్సులు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను అప్పగిస్తే.. అందరినీ మోసం చేసింది. పసిపిల్లల రక్తనాళాల్లోకి సిరంజితో గాలిని ఎక్కించడం, కడుపులోకి గొట్టాల ద్వారా ఎక్కువ మొత్తంలో పాలు, ఇతర ద్రవాలను పంపడం, శ్వాస ఆడకుండా చేయడం ద్వారా వరుస హత్యలకు పాల్పడింది. బ్రిటన్ కు చెందిన లూసీ లెట్బీ(33) అనే ఆ సైకో కిల్లర్ నర్స్​ను శుక్రవారం మాంచెస్టర్ క్రౌన్ కోర్టు దోషిగా తేల్చింది. సోమవారం ఆమెకు శిక్షను ఖరారు చేయనుంది. మరో ఐదుగురు పిల్లల హత్యకు ప్రయత్నించిందని ఆమెపై అభియోగాలు ఉన్నా.. సాక్ష్యాధారాల్లేక కోర్టులో రుజువుకాలేదు. సైకో నర్సును దోషిగా నిలబెట్టడంలో ఇండియన్ ఆరిజిన్  డాక్టర్ ఒకరు కీలక పాత్ర పోషించారు.  

ఎందుకు చంపిందంటే..?

విచారణలో భాగంగా నర్సు నివసిస్తున్న ఇంటిని సోదా చేయగా లెట్బీ డైరీలు దొరికాయని, అందులోని రాతలను చూసి షాక్ అయ్యామని చెప్పారు. ‘‘పిల్లలను చూసుకునేందుకు నేను అంత మంచిదాన్ని కాదు. నేను చెడ్డ దాన్ని. అందుకే పిల్లలను చంపేశాను” అంటూ నోట్స్​లో ఆమె స్వయంగా రాసుకున్నట్లు గుర్తించారు. అలాగే, నవజాత శిశువులు సీరియస్ కండిషన్​లో ఉంటే వారిని డాక్టర్లతో కలిసి కాపాడేలా ఆమె ట్రెయినింగ్ పొందింది. కానీ హాస్పిటల్ లో పిల్లలు అంత సీరియస్ కండిషన్​లో లేని సందర్భాల్లో బోర్​​గా ఫీల్ అయిన ఆమె వారి ప్రాణాలతో చెలగాటం ఆడినట్లు విచారణలో తేలింది. పిల్లలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. డాక్టర్లతో కలిసి వారిని కాపాడేందుకు ప్రయత్నించడాన్ని థ్రిల్లింగ్ గేమ్ గా భావించిందని పోలీసులు తెలిపారు. మరోవైపు హాస్పిటల్​లో ఓ డాక్టర్​తో ఆమె క్లోజ్​గా ఉండేదని, పిల్లలు సీరియస్​గా ఉన్నప్పుడు ఆ డాక్టర్ వచ్చి చూస్తుండేవాడని గుర్తించారు. ఆ డాక్టర్​తో కలిసి పిల్లలకు ట్రీట్మెంట్ చేయడం కోసమని కూడా పిల్లలను చావుబతుకుల మధ్యకు నెట్టిందని పోలీసులు తేల్చారు. అలాగే తనకు ఎప్పటికీ పెండ్లి కాదని, పిల్లలు పుట్టరని, కుటుంబం అంటూ ఒకటి ఉండదని కూడా ఆమె నోట్స్ లో రాసుకున్నట్లు కూడా గుర్తించారు.

ఇండియన్ డాక్టర్ ముందే చెప్పినా.. 

నార్తర్న్ ఇంగ్లాండ్ లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్ లో 2015 నుంచి 2016 మధ్య లూసీ లెట్బీ ఈ హత్యలకు పాల్పడినట్లు కోర్టు తేల్చింది. అయితే, అదే హాస్పిటల్ లో పిల్లల డాక్టర్ గా పని చేస్తున్న ఇండియన్ ఆరిజిన్ డాక్టర్ రవి జయరాం లూసీని మొదట్లోనే అనుమానించారు. మొదట ముగ్గురు పిల్లలు చనిపోగానే.. ఆ సమయంలో నవజాత శిశువుల వార్డులో డ్యూటీలో ఆమెనే ఉండ టంతో అనుమానం వ్యక్తంచేసినా, అధికారు లు పట్టించుకోలేదు. తాను చెప్పినప్పుడే ఎంక్వైరీ చేసి ఉంటే.. మిగతా పిల్లలు అయినా బతికి ఉండేవారని ఆయన శుక్రవారం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత మాట్లాడుతూ ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, లూసీ లెట్బీపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చేందుకు 2017లో నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) అనుమతి ఇచ్చింది. దీంతో డాక్టర్ల ఫిర్యాదు మేరకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు లూసీని అరెస్ట్ చేశారు.