
హైదరాబాద్ :తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత….నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరయ్యారు. అక్కడ జాతీయ పతాకావిష్కరణ చేశారు. పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన KCR..రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చెప్పారు. ఎన్నికల హామీలను అన్నీ ఒక్కొక్కటిగా తీరుస్తామని తెలిపారు. పెంచిన పించన్లను జూలై 1 నుంచి అమలు చేస్తామని చెప్పారు.
వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామన్న సీఎం.. విద్యుత్ సరఫరాలో గుణాత్మక మార్పు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నూతనోత్తేజం చేకూరుస్తున్నట్లు తెలిపారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ సఫలం అవుతోందన్నారు. వేసవిలోనూ తాగునీటి కోసం మైళ్ల దూరం వెళ్లే బాధలు తప్పాయన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ఆసరా పింఛన్లు నేరుగా లబ్దిదారులకే అందుతున్నాయన్నారు. వృద్ధ్యాప్య పింఛన్ల వయోపరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించినట్లు చెప్పిన ఆయన… రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కంటి వెలుగు పథకం పేద ప్రజలకు పెద్ద వరంగా మారిందన్న సీఎం.. త్వరలోనే దంత, చెవి, ముక్కు వ్యాధుల నిర్దరణకు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి పథకానికి వచ్చిన ఆశీస్సులే ప్రభుత్వానికి పెట్టని కోటలు అన్నారు. మిషన్ కాకతీయ అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. అన్ని నీటి వనరుల్లో చేపల పెంపకానికి విత్తనాలు ఇచ్చాం. చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వం సఫలమైందన్నారు. బతుకమ్మ, బోనాలు, క్రిస్మస్, రంజాన్‌లను రాష్ట్ర పండుగలుగా గుర్తించామన్నారు. ప్రజా వైద్యంపై విశ్వాసం పెరిగేలా ఆస్పత్రుల పనితీరు మెరుగుపర్చామన్నారు సీఎం కేసీఆర్.