- అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?
- ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావుకు సిట్ ప్రశ్నలు
- 9 గంటలపాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ విచారణ
- ఇక ప్రముఖ నేతలకు నోటీసులు!
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులైన రాజకీయ నేతల గుట్టురట్టు చేసే విధంగా సిట్ దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ నవీన్ రావును ఆదివారం విచారించింది. ఎస్ఐబీ కేంద్రంగా పని చేసిన స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ కోసం సాఫ్ట్వేర్ కొనుగోలుకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఈ మేరకు నవీన్ రావును సిట్ సభ్యులు గ్రేహౌండ్స్ డీఎస్పీ రవీందర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉదయం11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 9 గంటల పాటు విచారించారు.2024 సెప్టెంబర్ లో రికార్డ్ చేసిన స్టేట్ మెంట్ ఆధారంగా వివిరాలు సేకరించారు. ప్రధానంగా ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకర్ రావు సహా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించడానికి గల కారణాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఎవరు చెప్తే రూ. కోట్లు పెట్టి సాఫ్ట్ వేర్ తెప్పించారు? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ప్రశ్నల వర్షం కురిపించారు.
ట్యాపింగ్ కోసం రెండు సాఫ్ట్‌వేర్స్
ఫోన్ ట్యాపింగ్ కోసం కేంద్ర హోమ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా సాఫ్ట్‌వేర్‌లు కొనుగోలు చేసినట్లు ఇప్పటికే స్పెషల్ టీమ్ ఆధారాలు సేకరించింది. ఎలాంటి అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా ట్యాపింగ్ చేసేందుకు రెండు అత్యాధునిక సాఫ్ట్‌వేర్స్‌ను వినియోగించినట్లు గుర్తించింది. ఎస్‌ఐబీకి టెక్నికల్ సర్వీసెస్ కన్సల్టెంట్ రవిపాల్ కంపెనీల పేరుతో రెండు రకాల ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్స్, పరికరాలు కొనుగోలు చేశారు. ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు అత్యాధునిక సాఫ్ట్‌వేర్ రూపొందించడంతో చాలా వరకు డేటా ఆటోమేటిక్ ఫార్మాట్ అయ్యింది. కాగా, ఈ సాఫ్ట్ వేర్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సర్వర్లతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రైవేట్ సంస్థల సర్వర్లతో ఆపరేట్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఇందులో పలు ఐటీ కంపెనీలకు చెందిన సర్వర్లను ట్యాపింగ్ కోసం వినియోగించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
తెరవెనుక నవీన్ రావు
గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన నవీన్ రావు.. సిటీ టాస్క్‌ఫోర్స్ తరహాలోనే ఎస్‌ఓటీ పోలీసులతో స్పెషల్ ఆపరేషన్స్ చేసేందుకు తమ సామాజిక వర్గ అధికారులను నియమించడం లోనూ కీలకంగా వ్యవహరించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ప్రభాకర్ రావు సహా నిందితుల స్టేట్ మెంట్ల ప్రకారం.. నవీన్ రావు ఆధ్వర్యంలోనే ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్లు సిట్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ప్రభుత్వానికి సంబంధించిన నిధుల నుంచి కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్ పరికరాలను సేకరించినట్లు తెలిసింది. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నిధుల నుంచి అనుమతులు లేని సాఫ్ట్‌వేర్స్ కొనుగోలు చేస్తే చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నందున ఎమ్మెల్సీ నేతృత్వంలో ఇజ్రాయెల్, మలేసియా దేశాల నుంచి ఫోన్‌ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్స్ తెప్పించారని సమాచారం. ఈ మేరకు డబ్బు తరలింపుపై కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోకస్ చేసింది. ట్యాపింగ్ ద్వారా కార్పొరేట్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ఫండ్ కలెక్ట్ చేసేందుకు ప్రణీత్ రావు ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు సిట్ గుర్తించినట్లు తెలిసింది. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, ఫార్మా, ఐటీ కంపెనీల వద్ద ఫండ్స్ సేకరించే వారని ఆధారాలు సేకరించింది. ఇక నవీన్ రావు ఇచ్చిన సమాచారంతో ప్రముఖ నేతలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
