నేను గెలిచుంటే సగం దేశానికి అగ్గిపెట్టేటోడిని: కేసీఆర్

నేను  గెలిచుంటే సగం దేశానికి అగ్గిపెట్టేటోడిని: కేసీఆర్
  • నేను పోంగనే కట్క ఒత్తినట్టే కరెంటు బందైంది
  • మేడిగడ్డలో ఇసుకజారి రెండు పిల్లర్లు కుంగాయంతే.. 
  • దానికే ప్రళయం వస్తదా? దేశం కొట్టుకుపోతదా?
  • రెండ్రోజుల్లో టీవీల ముంగటకొచ్చి కాళేశ్వరంపై మాట్లాడుతా
  • తలమాసినోళ్లు పోతే పార్టీ​ ఖతమని బేవార్స్​చానళ్ల ప్రచారం
  • సోషల్​ మీడియాలో పోస్టులు పెడితే బెదిరించడం మంచిదికాదు 
  • మేం ఉన్ననాడు పోలీసులు దౌర్జన్యాలు చేయలే.. కరీంనగర్​లో బీఆర్ఎస్​ సభ 

కరీంనగర్, వెలుగు: ప్రజలు అత్యాశకు పోయారని, అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయి కాంగ్రెస్​ పార్టీని గెలిపించారని బీఆర్​ఎస్​ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ అన్నారు. మేడిగడ్డలో ఉన్న 300 పిల్లర్లలో ఇసుకజారి రెండు పిల్లర్లు కుంగితే ప్రళయం వచ్చినట్టు, దేశమే కొట్టుకపోయినట్టు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. మొన్న ప్రజలు తనను ఆగబట్టిండ్లుగానీ ఇక్కడ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే సగం దేశానికి అగ్గిబెట్టేటోడినని అన్నారు. కరీంనగర్ ఎస్​ఆర్​ఆర్​ కాలేజీ గ్రౌండ్స్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కరీంనగర్ కదనభేరీ బహిరంగ సభనుంచి  బీఆర్​ఎస్​ లోక్​సభ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో వంద కాంపొనెంట్లలో మేడిగడ్డ ఒకటని, అందులో ఉన్న 300 పిల్లరల్లో కొంచెం ఇసుకజారి రెండు పిల్లర్లు కుంగాయని తెలిపారు.  

మన పండ్లలో ఒక పన్నుపోతే 32 పండ్లు ఊడగొట్టుకుంటమా? అని ప్రశ్నించారు. తానే రెండు రోజుల్లో టీవీల ముంగట కూర్చోబోతున్నానని, కాళేశ్వరం సంగతేందో, ఎందుకు కట్టినమో చెప్తానని వెల్లడించారు. కాళేశ్వరం పుణ్యంతోనే కరీంనగర్ జిల్లాకు నీళ్లొచ్చాయని తెలిపారు. తన కండ్ల ఎదుటే ఇంత తొందర్లోనే కరెంట్ మాయం కావడం, రైతుల కండ్లళ్ల నీళ్లు పెట్టుకోవడం, కొందరు రైతులు పంటకు నిప్పంటించుకోవడం చూసి దుఃఖం కలుగుతున్నదని కేసీఆర్​ అన్నారు. 

చిన్నదెబ్బ తగిలింది ఓర్చుకుందాం

'మొన్న మీరు నాకు బ్రేక్ కొట్టిండ్లు. నేను ఇక్కడ గెలిచి ఉంటే ఇప్పటికే దేశంలో చిచ్చు అంటించేటోన్ని. మొత్తం దేశాన్నే  చైతన్యం చేసేటోన్ని. చిన్న దెబ్బ తగిలింది ఫర్వాలేదు.. ఓర్చుకుందాం.. మనం ఉద్యమాలు చేసినోళ్లం.. పేగులు తెగేదాక కొట్లాడినోళ్లం..  ధైర్యం ఉన్నోళ్లం.. కొట్లాడుదాం' అని కేసీఆర్​ పిలుపునిచ్చారు. దేశంలో అవసరానికి మించి బొగ్గునిల్వలు, నదీ జలాలు ఉన్నాయని, మంచిగా పరిపాలించగలిగే ప్రభుత్వం ఉంటే యావత్తు దేశానికి కరెంట్ కొరత లేకుండా ఉంటుందని తెలిపారు.  తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలని, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ బలం, తెలంగాణ గళం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారని, ముఖ్యమంత్రి మూడు నెలల్లో 9 సార్లు ఢిల్లీకి పోతరా?  అని ప్రశ్నించారు. సీఎం రేవంత్​ మాట్లాడే భాష సరిగా లేదని, తానెప్పుడూ అలా మాట్లాడలేదని అన్నారు. 

మిషన్ భగీరథను నడపరాదా?

భగీరథ ప్రయత్నం చేసి.. రెండు, మూడు నెలలు కష్టపడి తాను మంచి పథకం తీసుకొచ్చానని, భగీరథ నీళ్లు తెచ్చి ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇయ్యకపోతే  2018 ఎన్నికల్లో ఓట్లడగనని అసెంబ్లీలో శపథం చేశానని కేసీఆర్ గుర్తు చేశారు. ఆదిలాబాద్ గోండు గూడెం వరకు ప్రతి ఇంటికీ నీళ్లిచ్చి ఓట్లడిగానని, ఈ పథకాన్ని ఇప్పుడు నడిపే తెలివి లేదా?  అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏడాదిన్నరలో 24 గంటలు కరెంట్ ఇచ్చానని, ఇప్పుడు కట్క వేసినట్లే కరెంట్ ఎట్ల బంద్ అయ్యిందని ప్రశ్నించారు. కరోనా వచ్చినప్పుడు  కూడా రైతుబంధు ఆపలేదని, ‘ఇవ్వాళ రైతుబంధు ఎయ్యడానికి చేతగావట్లేదా?’ అని మండిపడ్డారు. తాము వేసినట్లు రైతుబంధు ఈ దద్దమ్మలకు ఇయ్యత్తలేదని, ప్రజలు ఆలోచించాలని కోరారు.

ప్రజలకు కాపలాదారుగా ఉంటాం

'లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ కే ఓటేస్తే.. మేం రైతుబంధు ఇయ్యకున్నా.. కరెంట్ ఇయ్యకున్నా, పొలాలు ఎండబెట్టినా, మోటార్లు కాలబెట్టినా మళ్లీ మాకే ఓటేసిండ్లని అంటరు. ఆరు గ్యారంటీల్లేవు.. మూడు గ్యారంటీల్లేవు.. అన్నింటికీ ఎగనామం పెడతరు. ఈ టైంలో కర్రుకాల్చి సురుకు పెట్టకపోతే వారికి అహంకారం పెరిగిపోతది. నిజంగానే రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతరు’ అని కేసీఆర్​ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా ఉంటాం' అని  చెప్పుకొచ్చారు.
బండి సంజయ్​ ఐదేండ్లలో

5 రూపాయలైనా తెచ్చిండా? 

రాష్ట్రానికి ఒక్క నవోదయ, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని కేసీఆర్ ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో  ఐదేండ్లలో ఐదు రూపాయల పనైనా చేసిండా? అని విమర్శించారు. అసలు సంజయ్​కి, వినోద్​కు పోలికే లేదని, ఇద్దరికీ నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. వినోద్ కుమార్ నిజాయితీకి మారుపేరని చెప్పారు.

బేవార్స్ చానళ్ల ప్రచారం మానుకోవాలి 

కరీంనగర్ సభలో మీడియా చానళ్లపైనా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అక్కడనో.. ఇక్కడనో  తలమాసినోడు ఒకరో ఇద్దరో పోతే.. కొన్ని బేవార్స్ చానళ్లు బీఆర్ఎస్ ఖతమైంది అని ప్రచారం చేస్తున్నయి. ఇదివరకు ఇట్ల అన్నోడు ఖతమైండుగానీ గులాబీ జెండా ఎన్నడూ ఖతం కాలేదు. బిడ్డా.. జాగ్రత్త మీ దొంగ ప్రచారాలకు భయపడేటోడు లేడు. మళ్లీ కొద్ది రోజుల్లోనే ఎంతో వైభవంగా బీఆర్ఎస్ వస్తదో మీరే కళ్లారా చూస్తరు. మీరే సలామ్ లు కొట్టుకుంట వస్తరు. కాబట్టి మీ బేవార్స్, బ్రోకర్ ప్రచారాన్ని మానుకోండి' అని హెచ్చరించారు. సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఎంపీ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మాజీ మంత్రి మహమూద్ అలీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సతీష్ బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు. 

పోలీసులకు రాజకీయాలు ఎందుకు ? 

కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు ఎవరూ భయపడొద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా కల్పించారు. ‘పోలీసులకు మనవి చేస్తున్నా. గ్రామాల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినోళ్లను కూడా బెదిరిస్తున్నరు. మీ పోలీసులకు రాజకీయాలు ఎందుకండీ. ఇవ్వాళ ఎవరికి అధికారం శాశ్వతం. ప్రభుత్వంలో మేం పదేండ్లు ఉన్నాం. మా మీద కూడా కొన్ని కుక్కలు మొరిగినయి. ఎవడి పాపాన వాడు పోతడని అనుకున్నం. ఎన్నడూ దౌర్జన్యాలు చేయలే. మేం దౌర్జన్యాలు చేస్తే ఒక్క కాంగ్రెసోడైనా మిగులునా’ అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ మాట్లాడుతుండగానే జనం తిరుగుపయనం 

సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన కేసీఆర్​ బహిరంగ సభ రాత్రి 6.40  గంటలకు ప్రారంభమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం 7.05 గంటలకు మొదలై 7.40 గంటలకు ముగించే సమయానికి సగం మందికిపైగా ప్రజలు స్వస్థలాలకు వెనుదిరిగారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయి.  సభ వెలవెలబోతూ కనిపించింది.