న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగా జనవరి 1, 2025 వరకు బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగంపై ప్రభుత్వం నిషేదం విధించింది. దీపావళి పండుగ వేళ బాణాసంచాపై నిషేదం విధించడంతో ఆప్ ప్రభుత్వం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హిందు పండుగలపై ఆమ్ ఆద్మీ సర్కార్ వివక్ష చూపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో బాణాసంచా నిషేధంపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల పండుగను లక్ష్యంగా చేసుకుని బాణాసంచాపై నిషేధం విధించారని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు చేసిన విమర్శలను తోసిపుచ్చారు.
కాలుష్యం నుండి ఢిల్లీ ప్రజలను రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ బాణసంచా నిషేధాన్ని ఆయన సమర్థించారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తోన్నట్లుగా ఇందులో ఎలాంటి హిందూ–-ముస్లిం, రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. దీపావళి అంటే దీపాల పండుగ అన్న కేజ్రీవాల్.. కాలుష్యానికి కారణమయ్యే బాణాసంచా పేల్చకుండా దియా, కొవ్వొత్తులను వెలిగించి జరుపుకోవాలని అన్నారు. సంతోషం కోసం మనం కాల్చే ఈ బాణాసంచా రేపు మన పిల్లలపైన ప్రభావం చూపిస్తుందని అన్నారు.