మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్

మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్
  •     సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  •     హైదరాబాద్​కు తరలింపు
  •     నేడు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్న పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రికిరాత్రి హైదరాబాద్​కు తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన అనంతరం బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరు పరుచనున్నారు. ఈ కేసులో పంజాగుట్ట పీఎస్​లో ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే.

ఎస్‌‌‌‌ఐబీ లాగర్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌లో హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్‌‌‌‌రావు పక్కా ప్లాన్‌‌‌‌తో వ్యవహరించినట్లు తెలిసింది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్‌‌‌‌బీలో రిపోర్ట్‌‌‌‌ చేశారు. అక్కడ జాయిన్ అయిన రెండు రోజులకే సిక్ లీవ్‌‌‌‌ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్​కు వారం రోజుల ముందు నుంచే డీసీఆర్‌‌‌‌బీకి వెళ్లలేదని తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ప్రణీత్‌‌‌‌రావు ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి దాడి చేసి, ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్​రావును హైదరాబాద్​కు తరలించారు.