మతం పేరిట విడిపోతే అభివృద్ధి ఉండదు: ఆకునూరి మురళి

మతం పేరిట విడిపోతే అభివృద్ధి ఉండదు: ఆకునూరి మురళి

ఖైరతాబాద్, వెలుగు : దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మతం పేరిట ఎవరికి వారూ విడిపోతే దేశాభివృద్ధి ఆగిపోతుందని తెలిపారు. లౌకికవాదంతో  దేశ సమగ్రతను కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజల పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ మురళీ ధర్ గుప్తా అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆకునూరి మురళి చీఫ్ గెస్టుగా అటెండ్ అయ్యారు. సేవ్ డెమోక్రసీ, సెక్యులరిజం అండ్ జస్టిస్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. దేశంలో లౌకికవాదం కనుమరుగైతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని ఆకునూరి మురళి హెచ్చరించారు. 

దేశ స్వాతంత్ర్య పోరాటంలో హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరూ కలిసి ఉద్యమించారని.. అందువల్ల సోదర భావంతో అంతా కలిసి ఉండాలని విజ్ఞప్తి చేశారు. దేశ చరిత్రను ప్రతి యువత, స్టూడెంట్లు చదవాలని సూచించారు. దేశ సమగ్రతకు ముప్పు తీసుకువచ్చేలా వ్యవహరించే ఏ మతస్థులైనా దేశ ద్రోహులేనని ఫైర్ అయ్యారు. ప్రతి పౌరుడు దేశరక్షణ, సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకిక వాద పరిరక్షణకు పాటుపడాలని చెప్పారు. తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. మేధావులు ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో ప్రొఫెసర్ సింహాద్రి, సోగర బేగం, శ్యామ్ సుందర్ రావు, విశ్వేశ్వర్ రావు  తదితరులు పాల్గొన్నారు.