హైకోర్టులో మాజీ న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ షావిలి పిటిషన్‌‌‌‌

హైకోర్టులో మాజీ న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ షావిలి పిటిషన్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం గుబ్బడి మండలంలోని తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి, ఆయన సోదరుడు అశోక్‌ కుమార్‌ షావిలి హౌకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ అభినంద కుమార్‌ షావిలికి  3.26 ఎకరాలు, ఆయన సోదరుడు అశోక్‌కుమార్‌ షావిలికి 1.04 ఎకరాలు చొప్పున ఉన్న భూమిని అధికారులు నిషేధిత జాబితాలో చేర్చడాన్ని పిటిషన్‌లో సవాల్‌ చేశారు.

తమ భూమిని నిషేధిత జాబితాలో చేర్చుతూ 2025, నవంబర్‌ 6న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారని తెలిపారు.1980లో పట్టాదారుల నుంచి 4.30 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, అప్పటి నుంచి తమ ఆధీనంలోనే ఉందని, రెవెన్యూ అధికారులు పాస్‌పోర్టులను కూడా జారీ చేశారని వివరించారు. అయితే, ఈ భూమి అసైన్డ్‌ ల్యాండ్‌గా అధికారులు పేర్కొంటూ నిషేధిత జాబితాలో చేర్చారని, ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారని చెప్పారు.

రెవెన్యూ రికార్డుల్లో తమ పూర్వీకుల పేర్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఏ ఆధారాలు లేకుండా రికార్డులకు విరుద్ధంగా అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ వివాదం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగానికి చెందినదని, సంబంధిత న్యాయమూర్తి ఎదుట కేసు ఫైల్‌ నివేదించాలని రిజిస్ట్రీని జస్టిస్‌ ఎన్‌.వి శ్రవణ్‌ కుమార్‌ సోమవారం ఆదేశాలను జారీ చేశారు.