సమాజ హితం కోరే కథలు.. గొంతెమ్మ కోర్కెల చిట్టా దురాశ.. కలవరపాటుకు కారణం ఇదే..!

సమాజ హితం కోరే కథలు.. గొంతెమ్మ కోర్కెల చిట్టా దురాశ.. కలవరపాటుకు కారణం ఇదే..!

మనుషులు, వ్యవస్థల్లోని అవలక్షణాల వల్ల సమాజం ఎదుర్కొంటున్న  సమస్యల చుట్టూ అల్లిన కథల సమాహారమే ‘విన్నపాలు వినవలె’ పుస్తకంలో న్యాయవ్యవస్థలో సుదీర్ఘకాలం సేవలందించిన జస్టిస్ బి. చంద్రకుమార్ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తాను చూసిన అనుభవాల దృక్కోణం నుంచి  రాసిన కథాసంపుటి ఇది. ఈ కథల్లో అవినీతి, దురాశ, మోసాలు, మూఢనమ్మకాలు, అతిభక్తి, పిసినారితనం, నమ్మకద్రోహం వంటివి కథాంశాలుగా కనిపిస్తాయి. అవి వినోదం, విజ్ఞానం పంచుతూనే ఆలోచింపచేస్తాయి. చైతన్యం కలిగిస్తాయి.  

ఈ పుస్తకంలో అగ్రతాంబూలం ‘గులాబి యాత్ర’ కథది. ఓ తోటలో విరిసిన అందమైన గులాబీ పువ్వు జీవిత పయనమిది. తన తల్లితోపాటు మరెన్నో గులాబీ మొక్కలను సంరక్షించి, కంటికి రెప్పలా సాకిన తోటమాలి కుటుంబానికి తమను పొందే అర్హత లేదని తెలుసుకొని గులాబీ పువ్వు విస్తుపోతుంది. మనుషుల గొంతెమ్మ కోర్కెలు తీర్చుకోవడంలో, అక్రమ సంపాదనలో తమని ఒక పావుగా వాడుకుంటుండడం చూసి ఆశ్చర్యపోతుంది.

 దేవుడి మెడలో నుంచి చివరికి చితిపైకి చేరినా.. ఆఖరి ఘడియల్లో ఒక స్వచ్ఛమైన ప్రేమ చిగురించడానికి కారణమయ్యాయని తృప్తిగా ప్రకృతిలో ఐక్యమవుతుంది.  గులాబీ పువ్వు చుట్టూ అల్లిన ఈ కథ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలను కళ్లకు కడుతుంది. 

పుస్తకం శీర్షిక పేరుతో ఉండే ‘విన్నపాలు వినవలె’ కథ... మనుషుల అంతులేని కోరికల కారణంగా కాస్తంత కునుకుకు కూడా నోచుకోని ఏడుకొండల వెంకన్న అవస్థను చెప్తుంది. సామాన్యుని నుంచి సన్నిధానంలోని పూజారి, ఈవో వరకు అందరి గొంతెమ్మ కోర్కెలను చిట్టాలో రాయలేక వినాయకుడే పారిపోవడం హాస్యంగా మలచినా, మనుషుల దురాశనూ గుర్తుచేసి కలవరపాటుకు కలిగిస్తుంది.  

దేవుడు ప్రత్యక్షమై, ఇంట్లో తిష్ఠ వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో ‘దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడు’ కథ చెప్తుంది. మూఢనమ్మకాలు ఎలా పురుడుపోసుకుంటాయో ‘గంపకింద పిల్లి’ చెప్తే; పరమ పిసినారి ఖర్చు తప్పించుకోవడానికి అవకాశాల కోసం ఎలా పొంచి ఉంటాడో ‘పాప విముక్తి’ వివరిస్తుంది. తిథులు, రాశులు మాత్రమే కాదు, డబ్బు కూడా ముహూర్తాలను నిర్ణయిస్తుందని ‘పెళ్లి ముహూర్తం’ చెప్తుంది. 

మంచితనం ముసుగులో మోసం చేయడానికి పరిచయాలను ఎలా వాడుకుంటారో చెప్పే ఉదాహరణలు ‘పరీక్ష రాస్తున్నా ఆశీర్వదించండి!’, ‘మీ ఫోన్ కు సెక్యూరిటీ కల్పిస్తా’. వీటితోపాటు మిగిలిన కథలూ చదివించేవే. పుస్తకంలో సంఖ్యాపరంగా18  కథలున్నప్పటికీ మూడు, నాలుగు మినహా మిగిలినవి పేజీ, పేజీన్నరలో ముగిసే కథానికలు. ఈ కథల్లో మానవ సంబంధాలు, సామాజిక విలువలను సరళమైన, సహజమైన భాషలో పొందుపరిచారు. 

రచయిత తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరించారు. పాత్రలన్నీ సహజంగా ప్రవర్తిస్తాయి. రచయిత వృత్తి జీవితంలోని సెక్షన్లు, శిక్షల ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తుంది. శైలి, శిల్పం లాంటి కొలమానాల పాటింపు ఈ కథలకు మరింత వన్నె తెచ్చి ఉండేది. అలాగే, కొన్ని కథాంశాలు ముందే తెలిసినట్లు అనిపించడం లోపం.  మొత్తంగా ‘విన్నపాలు వినవలె’ పుస్తకంలోని కథలు సమాజ హితం కోరే కథలు.
 
  - జి  మహేశ్వర్–