భారత్ జోడో యాత్రలో చెప్పుల్లేకుండా నడుస్తోన్న చాందీ ఊమెన్

భారత్ జోడో యాత్రలో చెప్పుల్లేకుండా నడుస్తోన్న చాందీ ఊమెన్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సాగిస్తోన్న భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా విపరీతమైన స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుమారుడు, ఇండియన్ యూత్ కాంగ్రెస్ నాయకుడు చాందీ ఊమెన్ భారత్ జోడో యాత్రలో చెప్పులు లేకుండా నడుస్తున్నారు. ఇది తనకు మరింత శక్తినిస్తోందని చెబుతున్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఔట్ రీచ్ సెల్ ఛైర్మన్ గా ఉన్న ఐవైసీ నాయకుడు చాందీ.. రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు.

ఈ విషయంగా చాందీని ప్రశ్నించగా.. తాను సాధానంగా యాత్రలో చెప్పులు లేకుండానే నడుస్తానని, మిగిలిన సమయంలో మాత్రం బూట్లు ధరిస్తానని చెప్పారు. అంతే కాదు.. ఇది రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రకు సంఘీభావమని స్పష్టం చేశారు.  ఇది తనకు మరింత ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుందని చాందీ చెబుతున్నారు. అందరూ ఒక్కటేనని, ఎలాంటి భేదాలుండవని, అంతా ఒకే కుటుంబానికి చెందినవారమని, అందరి మధ్య ఐక్యత ఉండాలని .. ఇదే తాను చెప్పుల్లేకుండా నడవడం ద్వారా ఇవ్వాలనుకున్న సందేశమని చాందీ వివరించారు. చలికాలంలో ఇలా నడవడం కష్టమే కానీ.. పెద్దగా ఇబ్బందేమీ లేదని చెప్పారు. ఇప్పటివరకూ తానూ రాహుల్ తో పాటు 3వేల కిలోమీటర్లు చెప్పుల్లేకుండానే నడిచానని చాందీ తెలిపారు.

ఇక రాహుల్ గాంధీ ఈ యాత్రలో ప్రతీ రాష్ట్రంలో లక్షల మందిని కలిశారని భారత్ జోడో యాత్రపై చాందీ మాట్లాడారు. రాహుల్ జీని కలవడానికి తెల్లవారుజాము నుంచే ప్రజలు వస్తుంటారని, కానీ ఆయన ఏ మాత్రం అసహనం వ్యక్తం చేయకుండా వారి మాటలు వింటారని చెప్పారు. ఇప్పటివరకు  ఈ యాత్రకు స్పందన బాగుందన్న ఆయన.. ఈ మార్చ్ తో తానూ భాగమైనందుకు గర్వపడుతున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాహుల్ యాత్ర హర్యానాలో సాగుతుండగా.. జనవరి 30న శ్రీనగర్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడంతో ముగుస్తుంది.