- చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నడు
- ఢిల్లీ వేదికగా తెలంగాణకు జలద్రోహం: హరీశ్‌రావు
- నీటిని కేసీఆర్ ఒడిసిపడితే.. రేవంత్ ఏపీకి విడిచిపెడుతున్నడు
- సీఎం ఎలాగూ పట్టించు కోడు.. ఉత్తమ్ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణకు జలద్రోహం జరుగుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. జలద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే.. పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి అని అన్నారు. సమైక్య పాలనలో నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ మీటింగ్ సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం మరణశాసనం రాయబోతున్నదన్నారు. పోలవరం, నల్లమల, సాగర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తున్నదన్నారు. తెలంగాణ జలాలను గురువు చంద్రబాబుకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. పక్కా ప్లాన్ ప్రకారం రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నారన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో హరీశ్ మాట్లాడారు. ‘‘పోను పోను అంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు ఢిల్లీ మీటింగ్ కు వెళ్లిండు. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపిండు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాల హక్కులను కాలరాసిండు. వేయను అంటూనే కమిటీ వేసి ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేసిండు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీంకోర్టుకు వెళ్లి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపిండు. పసలేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్ కు మద్దతు ప్రకటించిండు’’ అని వ్యాఖ్యానించారు. పేరుకే జలవివాదాల కమిటీ మీటింగ్ అని, కానీ.. మన 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ ప్రాజెక్టు కుట్ర అని ఆరోపించారు. తాము తెలంగాణకు నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తే.. రేవంత్ ఏపీకి నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నీటిని ఒడిసిపట్టింది కేసీఆర్ అయితే.. ఏపీకి విడిచిపెట్టింది రేవంత్ అన్నారు.
కేంద్రం ఏ హామీలిచ్చింది?
నిరుడు డిసెంబర్ 30న తాను ఉత్తరం రాస్తే ఆ తెల్లారి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని హరీశ్ రావు అన్నారు. నల్లమలసాగర్‌పై ఏపీ ముందుకుపోతున్నదని, డీపీఆర్ ప్రక్రియ సాగుతున్నదని లేఖలో స్పష్టంగా రాశారన్నారు. రెండు కండిషన్లకు ఒప్పుకుంటేనే మీటింగ్‌కు వస్తామని లేఖలో చెప్పారన్నారు. నల్లమలసాగర్ డీపీఆర్‌ను ఆపేయడంతోపాటు.. అనుమతుల ప్రక్రియను కేంద్రం వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారన్నారు. ప్రీ ఫీజిబిలిటీ రిపో ర్టుపై ఏపీ వెనక్కు తగ్గినట్టు హామీ ఇవ్వాలని చెప్పారన్నారు.
మరి, ఆ రెండు కండిషన్లకు కేంద్రం ఒప్పుకుందా.. హామీ ఇచ్చిందా అనేది ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రేవంత్ ఎలాగూ పట్టించుకోవడం లేదని, మంత్రి ఉత్తమ్ కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ‘‘ఈ మీటింగ్ కు ఆదిత్యనాథ్ దాస్ వెళ్లారు. ఆయనే కాళేశ్వరం, గోదావరి, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టు, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, చనాక కొరటా, రామప్ప డైవర్షన్లు అన్నీ అక్రమ ప్రాజెక్టులని చెప్పి నిలిపేయాలన్నడు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తిని మీటింగ్ కు పంపడమంటే తెలంగాణకు ద్రోహం చేయడానికే కదా? తెలంగాణ సోయి ఉన్న ఒక్క ఇంజనీర్ కూడా మీకు దొరకలేదా? దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు చేస్తున్నారు. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్పజెప్పడమేనా మీ చర్చల లక్ష్యం’’ అని హరీశ్ నిలదీశారు.
