కాంగ్రెస్​పై ప్రజలు తిరగబడే రోజులొస్తయ్: హరీశ్ రావు

కాంగ్రెస్​పై ప్రజలు తిరగబడే రోజులొస్తయ్: హరీశ్ రావు

మెదక్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేయడం లేదని, ఆ పార్టీపై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్స్ లో మెదక్, హవేలి ఘన్​పూర్ మండలాల పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ మీటింగ్​కు హరీశ్ రావు హాజరై మాట్లాడారు. ‘‘అధికారంలోకి వస్తే క్వింటాల్ వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్నరు. రైతు బంధు ఎకరాకు రూ.15 వేలు అన్నరు. అధికారంలోకి వచ్చాక మాత్రం ఏం చేయట్లేదు. కాంగ్రెస్ లీడర్లంతా జూటా మాటలు మాట్లాడుతున్నరు’’అని ఫైర్ అయ్యారు. రైతు బీమా దండగ అంటూ చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కరోనాతో  రెండేండ్లు ఇబ్బందులు ఎదురైనా, ఆదాయం రాకున్నా రైతు బంధు ఇచ్చామని తెలిపారు. మొత్తం 11 సార్లు రూ.72 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 

ఫ్రీ కరెంట్ ఇచ్చినం ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్​ అధికారంలో ఉన్నపుడు మాటిమాటికీ ట్రాన్స్​ఫార్మర్లు, మోటార్లు కాలిపోయి రైతులు తిప్పలు పడేటోళ్లు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టి ఫ్రీ కరెంట్ ఇచ్చింది”అని హరీశ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని పక్కా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి పాల్గొన్నారు.