హైదరాబాద్, వెలుగు: తాను బీజేపీలో చేరడం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి స్పష్టం చేశారు. తమ యూనివర్సిటీలోని ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు బీజేపీ స్టేట్ ఆఫీస్కు వచ్చానన్నారు.శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీని ఆమె కలిశారు. కొంతకాలంగా మల్లారెడ్డి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరగడం, ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు ప్రధాని మోదీని కలిశారు.
తాజాగా ప్రీతిరెడ్డి బీజేపీ స్టేట్ ఆఫీస్కు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ .. తివారీని కలవడంలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. తను రాజకీయాల గురించి ప్రస్తుతం మాట్లాడటం లేదని, విద్యావ్యవస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. హిందూ పండుగలను సెలబ్రేట్ చేసుకుంటున్నామని, అది బీజేపీ కోసం కాదన్నారు. తన మామ మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారని స్పష్టం చేశారు.

