తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి సెంగొట్టయన్‌ సస్పెండ్

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి సెంగొట్టయన్‌ సస్పెండ్

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి  కె.ఎ. సెంగొట్టయన్‌ అన్నాడీఎంకే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి ప్రకటించారు. పార్టీ నుంచి సస్పెండైన పన్నీర్‌సెల్వం, టిటివి దినకరన్‌లతో చేతులు కలపడంతో సెంగొట్టయన్‌‎ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు పళనిస్వామి స్పష్టం చేశారు. సెంగొట్టయన్‌ పార్టీ నియమాలను  పదే పదే ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

కాగా, ఇటీవల మాజీ మంత్రి  కె.ఎ. సెంగొట్టయన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి బహిష్కరించిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని.. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలవాలంటే ఈ పని చేయాల్సిందేనని అన్నారు. ఇటీవలి ఎన్నికల పరాజయాల తర్వాత పళనిస్వామి పార్టీలోని సీనియర్ నాయకుల సూచనలను విస్మరించారని విమర్శించారు. సెంగొట్టయన్‌ వ్యాఖ్యలు ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. 

సెంగొట్టయన్ వ్యాఖ్యలను దివంగత సీఎం జయలలిత నెచ్చలి శశికళ స్వాగతించారు. అన్నాడీఎంకే ఐక్యత కోసం సెంగొట్టయన్ ఇచ్చిన పిలుపు ప్రతి పార్టీ కార్యకర్త స్వరాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. దినకరన్ కూడా సెంగొట్టయన్ వ్యాఖ్యలను సమర్ధించారు. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను రక్షించడానికి, తమిళనాడులో జయలలిత పరిపాలనను తిరిగి తీసుకురావడానికి తాను, సెంగొట్టయన్, పన్నీరు సెల్వం కలిసి వచ్చామని పేర్కొన్నారు.

మరోవైపు.. పన్నీరు సెల్వంపై పళనీస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. పన్నీరు సెల్వం అన్నాడీఎంకే ప్రత్యర్థి డీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పన్నీరు సెల్వం చేసిన ద్రోహం వల్లనే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశాన్ని కోల్పోయామని.. అలాంటి ద్రోహుల కారణంగానే అధికారంలోకి రాలేకపోయామని ఘాటు ఆరోపణలు చేశారు.