ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని విచారణకు పిలిచిన ఈడీ.. 2026 మే 26 (మంగళవారం) ఈ మేరకు విచారించింది. ఈడీ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు చెవిరెడ్డి భార్య, కుమారుడు.
ఈ కేసులో చెవిరెడ్డి భార్య పేరు మీద పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. హవాలా, మనీ ల్యాండ్రింగ్ లో చెవిరెడ్డి భార్య, కుమారుడి పాత్ర వెలుగులోకి రావడంతో విచారణ వేగవంతం చేశారు.
మద్యం వ్యాపారాలు, లైసెన్సుల కేటాయింపుల వ్యవహారంలో చెవిరెడ్డి భార్య పేరిట భారీ ఎత్తున అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. హవాలా మార్గాల ద్వారా కోట్ల రూపాయల మేర చేతులు మారినట్లు వస్తున్న ఆధారాలపై అధికారులు వీరిని విచారించారని తెలుస్తోంది.
