వరంగల్ అర్బన్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. హన్మకొండ బస్టాండ్ సెంటర్‌లో పీవీ విగ్రహానికి పూల మాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌తోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్ టీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు పీవీని విస్మరించాయని ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కార్ మాత్రం పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఆయనను ఘనంగా స్మరించుకుంటోందని తెలిపారు.
‘పీవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన ఎదిగిన తీరు అందరకీ స్ఫూర్తిదాయకం. సొంతవారికి కూడా స్వలాభం చేకూర్చని నిజాయితీపరుడాయన. భూ సంస్కరణలు చేసి, పేదలకు భూములు అందేలా చేసిన మహనీయుడు పీవీ. ఆయన రాజకీయ ఎదుగుదల మన ప్రాంతం నుంచే మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పీవీని పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ మాత్రం పీవీకి సముచిత గౌరవం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పీవీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
