శివబాలకృష్ణ సోదరుడు నవీన్‌ కుమార్‌ అరెస్ట్‌

 శివబాలకృష్ణ సోదరుడు నవీన్‌ కుమార్‌ అరెస్ట్‌

హెచ్‌‌ఎమ్‌‌డీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్‌ కుమార్‌ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి పేరు మీద ఉన్న ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణ బినామీగా శివ నవీన్‌ కుమార్‌ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.  దాదాపుగా మూడు రోజుల పాటు విచారించిన అనంతరం   శివ నవీన్‌ కుమార్‌ ను అదుపులోకి తీసుకున్నారు.  కాగా ఆదాయానికి మించి ఆస్తుల సంపాదన కేసులో శివబాలకృష్ణను   ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  హెచ్‌‌ఎమ్‌‌డీఏ టౌన్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా పనిచేసిన సమయంలో ఆయన భారీగా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. గత పన్నెండేళ్లలో శివబాలకృష్ణ ఆదాయం రూ.2.48 కోట్లు కాగా.. ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే రూ.8.26 కోట్లుగా ఏసీబీ గుర్తించింది.

శివబాలకృష్ణ ఇంట్లో రూ.84 లక్షలకు పైగా నగదు సీజ్ చేశారు. రూ.15 లక్షలు విలువ చేసే 40కి పైగా వాచ్‌‌లు, 20కి పైగా అత్యంత ఖరీదైన సెల్‌‌ఫోన్స్‌‌, ల్యాప్​టాప్స్,​ గిఫ్ట్​ఆర్టికల్స్​స్వాధీనం చేసుకున్నారు. రెండు కిలోల బంగారం, కోట్ల రూపాయలు ధర పలికే 75 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అన్నీ కలిపి దాదాపు రూ. 300 కోట్లకు పైగా ఆస్తులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. శివబాలకృష్ణ హెచ్‌‌ఎండీఏలో 2018 నుంచి గతేడాది వరకు  టౌన్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం రేరా సెక్రటరీగా పనిచేస్తున్నాడు. గతంలో మున్సిపల్‌‌అడ్మినిస్ట్రేషన్‌‌ అండ్ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా పనిచేశాడు. ఆ  సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

రేపటితో ముగియనున్న కస్టడీ

కస్టడీ విచారణలో శివబాలకృష్ణ సోదరుడు సునీల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా బినామీలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. డాక్యుమెంట్లు బ్యాంక్‌‌‌‌‌‌‌‌ లావాదేవీలను వారి ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు. ఔటర్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌రోడ్‌‌‌‌‌‌‌‌ చుట్టూ, రీజనల్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌ వచ్చే చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌, యాదాద్రి భువనగిరి పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు,స్నేహితుల పేర్లతో 120 ఎకరాలకు పైగా భూముల రికార్డులను ఏసీబీ అధికారుల సీజ్ చేసినట్లు సమాచారం. బుధవారంతో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో శివబాలకృష్ణకు చెందిన అక్రమాస్తుల చిట్టాను సేకరించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.