తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిండు.. గచ్చిబౌలిలో మల్లికార్జున్ 82వ జయంతి వేడుకలు

తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిండు.. గచ్చిబౌలిలో మల్లికార్జున్ 82వ జయంతి వేడుకలు
  • తొలిదశ ఉద్యమకారుడు మల్లికార్జున్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన దత్తాత్రేయ
  • రాష్ట్ర సర్కార్‌‌ ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదు: వివేక్‌ వెంకటస్వామి

గచ్చిబౌలి, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ మల్లికార్జున్‌ తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పోరాడి, ఆ పోరాటాన్ని రాష్ట్రం మొత్తానికి తెలిసేలా చేశారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మల్లికార్జున్ 82వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ విగ్రహాన్ని ఆయన సతీమణి భాగ్యలక్ష్మి, కుమారుడు మను మల్లికార్జున్‌తో కలిసి దత్తాత్రేయ ఆవిష్కరించారు.

అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ, రాష్ట్రం కోసం నిరంతరం పోరాడిన నేత మల్లికార్జున్ అని, తెలంగాణ సేఫ్ గార్డ్స్ పేరుతో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేసిన కాకా వెంకటస్వామి, మల్లికార్జున్ పేర్లను చరిత్రలో ఎక్కించాలన్నారు. ఇందిరా గాంధీ ప్రధాని కావడంలోనూ మల్లికార్జున్ కృషి ఉందన్నారు. మల్లికార్జున్ కింది స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగారన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో శ్రద్ధ, అంకితభావం కనుమరుగవుతోందని, ఇది చాలా దురదృష్టకరమని దత్తాత్రేయ పేర్కొన్నారు. 

తెలంగాణ పోరాటంలో యువతకు ప్రోత్సాహం: వివేక్​

మల్లికార్జున్, తన తండ్రి కాకా వెంకటస్వామి ఇద్దరూ కలిసి తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. తమ కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా, ఎంపీగా మల్లికార్జున్ చాలా మంచి పనులు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ పోరాటంలో యువత మేల్కొనేలా ప్రోత్సహించారన్నారు.

రాష్ట్ర సర్కారు మల్లికార్జున్‌కు తగిన గౌరవం ఇవ్వలేదని, రాబోయే బీజేపీ ప్రభుత్వంలో ఆయనకు గౌరవం ఇస్తామని తెలిపారు. అనంతరం మల్లికార్జున్ సతీమణి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. తన భర్త స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని, ఆయన సేవలను స్మరించుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ కె.కేశవరావు, మాజీ ఎమ్మెల్యేలు గురునాథ రెడ్డి, భిక్షపతి యాదవ్‌, మహబూబ్‌ నగర్‌ డీసీసీ మాజీ అధ్యక్షుడు ఒబైదుల్లా కొత్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.