పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నేతలపై చర్యలకు దిగింది. ఇందులో భాగంగా బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ అశోక్ కుమార్ అగర్వాల్, అతని భార్య, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌లపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరించిన ముగ్గురు ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది.
కాగా, మోడీ ప్రభుత్వంలో విద్యుత్ మంత్రిగా, మాజీ కేంద్ర హోం కార్యదర్శిగా పనిచేసిన ఆర్‌కే సింగ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. మోకామాలో జరిగిన జన్ సూరజ్ కార్యకర్త హత్యను పరిపాలన, ఎన్నికల సంఘం వైఫల్యంగా ఎత్తి చూపారు. నేర చరిత్ర ఉన్న ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, అనంత్ సింగ్ వంటి ఎన్డీఏ నేతలను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. మరో బహిష్కృత నేత అశోక్ అగర్వాల్ తన కుమారుడు సౌరవ్ అగర్వాల్‌ను కతిహార్ నుంచి ప్రతిపక్ష మహాఘట్బందన్ కూటమి తరుఫున అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ క్రమంలోనే అశోక్ అగర్వాల్ తో పాటు ఆయన భార్యపై వేటు వేసింది బీజేపీ.
