
ఉప్పల్/నాచారం, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉప్పల్నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1945లో మల్లాపూర్ లో జన్మించిన ఆయన మల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి వరకు చదువుకున్నారు. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జీవితాంతం అందులోనే ఉన్నారు. కాప్రా మున్సిపాలిటీ చైర్మన్, TTD బోర్డు మెంబర్ గా పనిచేశారు.
2009లో ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన అప్పటి టీఆర్ఎస్అభ్యర్థి ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డిపై 28,183 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం అతని సోదరుడు బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. హబ్సిగూడలోని ఇంట్లో ఉంచిన రాజిరెడ్డి భౌతికకాయానికి కాంగ్రెస్, బీఆర్ఎస్నాయకులు నివాళులర్పించారు. వారిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్నేత సాయిజన్ శేఖర్, నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజన్, ఇతర నాయకులు ఉన్నారు. శుక్రవారం చీర్యాలలోని వ్యవసాయ క్షేత్రంలో రాజిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.