సందేశాత్మక కథతో ది హండ్రెడ్

 సందేశాత్మక కథతో ది హండ్రెడ్

‘మొగలి రేకులు’ సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘ది హండ్రెడ్’.  రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో  రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌‌లుక్‌‌, మోషన్‌‌ పోస్టర్‌‌ను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంచ్ చేశారు. అలాగే సినిమాను కూడా చూశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘సినిమా అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. 

సినిమా ప్రభావం సమాజంపై ఉంటుంది. ఈ మూవీ పాయింట్ చాలా కొత్తగా ఉంది. చిత్రీకరణ కూడా చాలా బావుంది. సినిమాలో మంచి సందేశం ఉంది. ఇంత చక్కటి సినిమాని రూపొందించిన నిర్మాతలకు, దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్‌‌‌‌కు, కథానాయకుడు సాగర్‌‌‌‌కు అభినందనలు. ఇందులో సాగర్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా బాగా నటించారు. సినిమా చూసిన తర్వాత పోలీస్ అధికారి సాగర్‌‌‌‌లానే  ఉండాలనే అభిప్రాయం కలుగుతుంది. 

ఈ చిత్రాన్ని  ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారనే విశ్వాసం ఉంది’ అని అన్నారు. ఆర్కే సాగర్ మాట్లాడుతూ ‘‘ది 100’ అనేది ఒక ఆయుధం.  ప్రతి మనిషి జీవితంలో ఈ ఆయుధం అవసరం వస్తుంది. ఫ్యామిలీస్  కచ్చితంగా చూస్తారనే నమ్మకం ఉంది. భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు చేస్తా’ అని చెప్పాడు. ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్ అని, కమర్షియల్ ఎలిమెంట్స్‌‌తో పాటు సోషల్ ఇష్యూని చూపించబోతున్నామని దర్శకుడు చెప్పాడు. వెంకయ్యనాయుడు గారు లాంటి మహావ్యక్తి  తమ సినిమా చూడటానికి రావడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత రమేష్ అన్నారు.