పొలిటికల్ లీడర్లు..అడ్డొస్తున్న పత్రికల అంతం చూస్తున్నారు : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

పొలిటికల్ లీడర్లు..అడ్డొస్తున్న పత్రికల అంతం చూస్తున్నారు : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • పత్రికలు, చానళ్లు​ ప్రజలవైపు నిలబడాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు 
  • నందిని సిధారెడ్డికి సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య పురస్కారం

బషీర్​బాగ్, వెలుగు: పత్రికలు, చానల్స్ ప్రజల వైపు నిలబడి పనిచేయాలే తప్ప.. ఓ పార్టీకో.. ఒక వ్యక్తికో పరిమితం కాకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పత్రికలు సమాజానికి దర్పణం లాంటివని, సమాజంలోని అవినీతిని ప్రజలకు జర్నలిస్టులు వివరించాలన్నారు. వృత్తి ధర్మంలో రాజకీయ పార్టీల యజమానుల జోక్యం పత్రికలపై తగ్గిపోవాలన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు తమకు అడ్డువస్తున్న పత్రికలను, చానల్స్ మూలలను నాశనం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతి పురస్కార ప్రధానోత్సవంలో వెంకయ్య నాయుడుతో పాటు శాంతా బయోటెక్ ఎండీ వరప్రసాద్ రెడ్డి, మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డికి సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య పురస్కారాన్ని వెంకయ్య నాయుడు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్రికలు ధైర్యంగా, స్వేచ్ఛగా రాసినప్పుడే సమాజం బాగుపడుతుందని అన్నారు. నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా కలంతో ఎదురొడ్డి నిలిచిన ధీరుడు సురవరం ప్రతాప రెడ్డి అని వెంకయ్య నాయుడు కొనియాడారు. తెలంగాణ భాష, యాస, గుర్తింపు కోసం ప్రతాప రెడ్డి చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. తెలుగు భాషా పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడన్నారు. సురవరం ప్రతాప రెడ్డి భావి తరాలకు గుర్తుండే విధంగా ఈ సమావేశాలు నిర్వహిస్తారని.. కానీ, నేటి తరం వీటిపై దృష్టి సారించకపోవడంపై వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. 

తెలుగుకు ఆదరణ లేని రోజుల్లో పత్రిక స్థాపన

తెలంగాణలో మొట్టమొదటిసారిగా సురవరం ప్రతాప రెడ్డి 1926లో ‘గోలకొండ’ అనే పత్రికను స్థాపించారని మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు. తెలుగుకు ఆదరణ లేని రోజుల్లో తెలుగు పత్రికను స్థాపించారని.. అది ఒక పెద్ద విప్లవమని కొనియాడారు. తెలుగు వారు అనగానే గుర్తొచ్చే వారిలో సురవరం ప్రతాప రెడ్డి ముందు వరసలో ఉంటారని పేర్కొన్నారు. ఆయన కథనాలు, రచనలు, వ్యాసాలు తవ్వేకొద్ది వెలుగులోకి వస్తున్నాయన్నారు. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం రాజుల పరిపాలనలో తెలుగుపై ఉన్న వివక్షను పక్కనబెట్టి, తెలుగు జాతి సంస్కృతిని దివిటిలా వికసింపజేసిన మహానీయుడు సురవరం ప్రతాప రెడ్డి అని అన్నారు.

అలాంటి వారు యుగానికి ఒక్కరే  పుడతారని కొనియాడారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. సురవరం ప్రతాప రెడ్డి పురస్కారం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిజాం నవాబుల చేతిలో బందియై చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగులోకి నడిపిన మహానుభావుడు సురవరం ప్రతాప రెడ్డి అని అన్నారు. తెలంగాణ జాతిని నడిపించడానికి ఆయన తెలుగు వైతాళికుడు అయ్యాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సురవరం కుటుంబ సభ్యులతోపాటు పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.