
వైఎస్ఆర్‌సీపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి బీజేపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీలో చేరడం సంతోషకరమైన విషయమని బండి సంజయ్ అన్నారు. గట్టు శ్రీకాంత్ రెడ్డి ఏప్రిల్ 3, 2021న వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ సమయంలో తాను జాతీయ పార్టీలో చేరి.. 2023 ఎన్నికలలో హుజుర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని తెలిపారు. శ్రీకాంత్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా.. బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రంలో కేసీఆర్ మూర్ఖత్వ పాలనను అంతం చేసేందుకు చాలామంది బీజేపీలో చేరుతున్నరు. బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. కేసీఆర్ నీ చరిత్ర తెరమరుగు చేస్తాం. నీ రాజకీయ భవిష్యత్‌కు తెలంగాణ ప్రజలు సమాధి కడతారు. నీ సంగతేందో తేలుస్తం. నిజాం పాలనలో జరిగిన అరాచకాలే.. కేసీఆర్ పాలనలోనూ జరుగుతున్నయి. హామీలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నడు. కేసీఆర్ ఒక పెద్ద మోసాగాడు. ఎన్నికలు వస్తేనే హామీలు గుర్తుకువస్తున్నయి. దళితులు, బీసీలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, గొర్లు, బర్లు, పోడు భూములు గుర్తుకు వస్తయి. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం కుర్చీ వేసుకుని కూర్చుంట అన్నడు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల మీదకు ఫారెస్ట్ అధికారులను ప్రభుత్వమే పంపుతుంది. ఫారెస్ట్ అధికారులతో గిరిజనులపై దాడి చేయిస్తోంది. ఆ దాడిని ప్రజాప్రతినిదులు ఆపినట్లు బిల్డప్ ఇస్తరు. ఎన్నికలు వచ్చినప్పుడు మాటలు చెప్తడు.. ఆ తర్వాత అమలు చేయకుండా ఫామ్‌హౌస్‌లో పంటడు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుస్తున్నడని తెలిసే బయటకు వస్తుండు. హుజూరాబాద్‌లో తలకాయ కిందికి.. కాళ్ళు పైకి పెట్టినా కేసీఆర్ గెలవడు. టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్ధి కూడా దొరుకతలేడు. టీఆర్ఎస్‌కు అక్కడ
డిపాజిట్ కూడా రాదు. బీజేపీ పొగ పెడితే బయట తిరుగుతున్నడు. నీ దొంగ తిరుగుళ్ళు ప్రజలకు తెలుసు. నువ్వు బయటకు ఎందుకు వస్తున్నవో కూడా తెలుసు. రాష్ట్రానికి కరోనా సహాయం ప్రకటించిన ప్రధానికి కృతజ్ఞతలు చెప్పాలనే సోయి లేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్. నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని త్వరలోనే ఉద్యమం చేస్తాం’ అని బండి సంజయ్ అన్నారు.