
హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా హుస్సేన్ సాగర్ ను కూడా శుభ్రం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరారు. హుస్సేన్‌సాగర్ మురికినీరు మూసీ నదిలోకే ప్రవహిస్తుందని.. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన చేయకుండా మూసీ ప్రక్షాళన సఫలీకృతం కాదని ఆయన తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన చేయాలని బుధవారం పద్మనాభరెడ్డి సీఎంకు లేఖ రాశారు.
గత 20 ఏండ్ల నుంచి హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు కోట్లు ఖర్చు చేస్తున్నా ఈ ప్రక్రియ పూర్తి కావడం లేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. 2006 లో హుడా ఆధ్వర్యంలో రూ.380 కోట్లతో ప్లాన్ రూపొందించారని, 2013 వరకు ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ పూర్తి కాలేదని తెలిపారు. గత 20 ఏండ్లలో సుమారు రూ. 500 కోట్లు ఖర్చుచేసినా ఆశించిన ఫలితాలు సాధించకపోగా దినదినానికి హుస్సేన్‌సాగర్ కలుషితమై కంపు కొడుతున్నదని పద్మనాభరెడ్డి తెలిపారు. ప్రస్తుతం బంజారా కాలువ, బల్కాపూర్ కాలువ, కూకట్ పల్లి కాలువల నుంచి వర్షపు నీరు, డ్రైనేజీ నీరు హుస్సేన్ సాగర్ లో కలుస్తున్నందున పొల్యూషన్ పెరిగిపోతోందని పద్మనాభరెడ్డి తెలిపారు.