ఘట్కేసర్/ శామీర్‌పేట /జీడిమెట్ల/ చేవెళ్ల, వెలుగు: నగరంలో పలు చోట్ల రోడ్డు యాక్సిడెంట్లు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు దుర్మరణం చెందారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టి ఒకరు మృతిచెందారు.
సీఐ రాజువర్మ తెలిపిన ప్రకారం.. పోచారం డివిజన్ తెనుగూడేనికి చెందిన ఈగ మహేశ్(40) జోడిమెట్లలోని మేథా సంస్థలో ఉద్యోగం చేస్తుంటాడు. బుధవారం బైక్‌పై ఇంటి నుంచి ఉద్యోగానికి బయల్దేరాడు. జోడిమెట్ల చౌరస్తా వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న అయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో స్పాట్లో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.
డివైడర్‌ను ఢీకొని యువకుడు..
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చైతన్య(25) కుటుంబంతో కలిసి మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం అలియాబాద్ గ్రామానికి వచ్చి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకొని తుర్కపల్లి నుంచి అలియాబాద్ వెళ్తుండగా లాల్ గడి మలక్ పేట దగ్గర్లోని ట్రక్ బే దగ్గర డివైడర్ ను ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయాలై స్పాట్లో మృతిచెందాడు. బైక్ వెనుక కూర్చున్న ఆకాశ్‌కు గాయాలయ్యాయి.
రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని..
జగద్గిరిగుట్ట లాస్ట్‌బస్టాప్ వద్ద నివాసముండే బొడ్డు గోవింద్(56) బాలానగర్‌లోని లేజర్ కంపెనీలో జాబ్చేస్తుంటాడు. బుధవారం ఉదయం ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తున్నాడు. బాలానగర్ డీ మార్ట్ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని బైక్ గోవింద్‌ను ఢీకొట్టింది. తీవ్రగాయాలైన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్‌కు చెందిన బక్కరెడ్డి రఘునాథ్ రెడ్డి(23) బుధవారం బైక్ పై మొయినాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్నాడు. తాజ్ హోటల్ వద్దకు చేరుకోగానే.. ఎదురుగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి స్పాట్లో చనిపోయాడు.
