పతకాల వేట: ఒక్క రోజే 4 మెడల్స్.. గోల్డ్ సాధించిన తొలి మహిళగా అవని

పతకాల వేట: ఒక్క రోజే 4 మెడల్స్.. గోల్డ్ సాధించిన తొలి మహిళగా అవని

టోక్యో పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. నిన్న రెండు సిల్వర్, ఒక బ్రాంజ్ తో మూడు పతకాలు సాధించిన మన క్రీడాకారులు... ఇవాళ (సోమవారం) 4 పతకాలు కైవసం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో... అవనీ లేఖరా గోల్డ్ మెడల్ గెలించింది. డిస్కస్ త్రోయర్ యోగేశ్ కథూనియా... క్లాస్ F56 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. జావెలిన్ త్రో క్లాస్ F-46 విభాగంలో రెండు పథకాలను భారత క్రీడాకారులే గెలుచుకున్నారు. దేవేంద్ర ఝఝారియా సిల్వర్, సుందర్ సింగ్ బ్రాంజ్ మెడల్ సాధించారు. 

పారాలింపిక్స్ లో షూటర్ అవనీ లేఖరా చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో... గోల్డ్ మెడల్ సాధించింది. ఉదయం జరిగిన ఫైనల్ లో 249.6 పాయింట్స్ సాధించిన అవనీ... గోల్డ్ మెడల్ గెలించింది. ఈ పారాలింపిక్స్ లో భారత్ కు ఇదే ఫస్ట్ గోల్డ్ మెడల్. పారాలింపిక్స్ కు సంబంధించి భారత చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన మొట్టమొదటి మహిళగా అవని రికార్డ్ క్రియేట్ చేసింది.  

ఇక ఇవాళ భారత్ కు రెండో మెడల్ సాధించి పెట్టాడు డిస్కస్ త్రోయర్ యోగేశ్ కథూనియా. క్లాస్ F56 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. 6 సార్లు అటెంప్ట్ చేసిన యోగేశ్... చివరి ప్రయత్నంలో 44.38 మీటర్లు విసిరి సిల్వర్ సాధించాడు. ఈ విభాగంలో... 45.59 మీటర్లు విసిరిన బ్రెజిల్ అథ్లెట్ క్లాడినీ బటిస్టా గోల్డ్ గెలిచాడు. 

జావెలిన్ త్రోలో రికార్డ్ సృష్టించారు మన పారా అథ్లెట్స్. జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝఝారియా 64.35 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్ సాధించాడు. 2004, 2016 పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ గెలిచాడు ఝఝారియా. ఇక సుందర్ సింగ్ గుర్జార్ బ్రాంజ్ మెడల్ గెలిచాడు. అతను 64.01 మీటర్లు విసిరాడు. ఈ విభాగంలో శ్రీలంకన్ అథ్లెట్ దినేశ్ ప్రియన్ గోల్డ్ మెడల్ గెలిచాడు. 

పారాలింపిక్స్ లో మెడల్స్ సాధించిన నలుగురికి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అవని గోల్డ్ మెడల్ సాధించడం...భారతీయ క్రీడలకు సంబంధించి స్పెషల్ మొమెంట్ అని చెప్పారు. యోగేష్ సిల్వర్ మెడల్ యువతకు స్పూర్తినిస్తుందన్నారు మోడీ. విజేతలతో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడారు మోడీ. 

మొత్తంగా ఇప్పటివరకు టోక్యో పారాలింపిక్స్ లో భారత పతకాల సంఖ్య ఏడుకు చేరింది. 2016లో రియో డీజనిరోలో జరిగిన పారాలింపిక్స్ లో 2 గోల్డ్ మెడల్స్ సహా 4  పతకాలు సాధించింది భారత్. అప్పటివరకు అదే రికార్డ్. ఈ సారి ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ... పతకాల వేట సాగిస్తున్నారు భారత పారా అథ్లెట్స్.