ముగ్గురి ఆత్మహత్య కేసులో.. నలుగురు అక్రమ వడ్డీ వ్యాపారులు అరెస్ట్

ముగ్గురి ఆత్మహత్య కేసులో.. నలుగురు అక్రమ వడ్డీ వ్యాపారులు అరెస్ట్

షీరాబాద్​/ పద్మారావునగర్, వెలుగు: అంబర్​పేటలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి సామూహిక ఆత్మహత్య కేసులో నలుగురు వడ్డీ వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి సోమవారం వెల్లడించారు. ఫిబ్రవరి 24న బాపునగర్​లోని తమ నివాసంలో కడ్గేకర్ రాంరాజ్, ఆయన భార్య మాధవి, కొడుకు శశాంక్ రాజ్ ఆత్మహత్యకు పాల్పడగా, వారి కుమార్తె అమూల్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో లభించిన ఆత్మహత్య లేఖలు, కాల్ డేటా రికార్డుల ఆధారంగా వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని నిర్ధారించారు. మల్లాపూర్, చక్రిపురంలో ‘కింగ్స్ బిర్యానీ’ హోటళ్ల నిర్వహణ కోసం సుమారు రూ.57 లక్షలు అప్పు తీసుకున్న బాధితులను నిందితులు అధిక వడ్డీ పేరుతో వేధించినట్లు గుర్తించారు.

ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, భూమి పత్రాలు బలవంతంగా స్వాధీనం చేసుకోవడం, ఫోన్ ద్వారా బెదిరింపులు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇలా అప్పుల వసూళ్ల పేరుతో వారిని తీవ్ర వేధింపులకు పాల్పడి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో నిందితులు మహ్మద్ వసీ ఉజ్ జమాన్, పి. రాజశేఖర రెడ్డి, మహ్మద్ నవాజ్, సయ్యద్ మజీద్ హైదర్​ను అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు. వారి వద్ద నుంచి 12 ఖాళీ చెక్కులు, 6 ప్రామిసరీ నోట్లు, ఒప్పంద పత్రాలు, వ్యవసాయ భూమి అసలు డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.