నల్గొండ జిల్లాలో షాకింగ్ ఘటన.. ఒకే ఇంట్లో నాలుగు డెడ్ బాడీలు.. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే..

నల్గొండ జిల్లాలో షాకింగ్ ఘటన.. ఒకే ఇంట్లో నాలుగు డెడ్ బాడీలు.. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే..
  • మృతుల్లో భార్య, భర్త, మొదటి భార్య కొడుకు, కూతురు
  • నాలుగు రోజుల క్రితమే మృతి.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు
  • హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు 
  • నల్గొండ జిల్లా కేంద్రంలో ఘటన

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. వారంతా నాలుగు రోజుల క్రితమే మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, వారు ఎలా చనిపోయారన్నది మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

నల్గొండ పట్టణానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ (45) ప్రకాశం బజార్ లోని లెదర్ షాపులో పనిచేస్తున్నారు. అతని భార్య హసీనా (40) ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. సుల్తాన్ మొదటి భార్య చనిపోవడంతో కొన్ని సంవత్సరాల క్రితం హసీనాను రెండో పెండ్లి చేసుకున్నాడు. వీరితో పాటు మొదటి కొడుకు ముజమ్మిల్ (20), కూతురు అప్సర (11) ఉంటున్నారు.

ముజమ్మిల్ ఏసీ రిపేరింగ్ వర్క్‌‌ షాప్‌‌లో పనిచేస్తున్నాడు. అప్సర తల్లి పని చేసే పాఠశాలలో 7 వ తరగతి చదువుతున్నది. వీరంతా నల్గొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో నివాసముంటున్నారు. సుల్తాన్ ఇంటికి శనివారం నుంచి తాళం వేసి ఉండడం, సోమవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు  గమనించి స్థానిక కార్పొరేటర్‌‌కు సమాచారం అందించారు. ఆయన పోలీసులకు విషయం తెలిపారు. 

స్పాట్​కు చేరుకున్న వన్ టౌన్ పోలీసులు ఇంటి బయటి గేటు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఇంట్లో నాలుగు మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలన్నీ పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. దీన్ని బట్టి వారు సుమారు నాలుగు రోజుల క్రితమే మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

కుటుంబ కలహాలే కారణమా ?
ఈ ఘటనపై ప్రస్తుతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరగడానికి ముందు ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పెట్టుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి ఇంట్లో పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వినిపించాయని పోలీసులకు స్థానికులు తెలిపారు.

ఈ నేపథ్యంలో కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇంటి బయట నుంచి తాళం వేసి ఉండడం, నాలుగు మృతదేహాల్లో ముగ్గురి మృతదేహాలు ఇంటి ఆవరణలో ఉండగా మరో మృతదేహం మాత్రం బెడ్ రూమ్ లో ఉండడంతో హత్య చేసి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే ఇది హత్యా? లేక ఆత్మహత్యా? తెలిసే అవకాశం ఉంది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశామని.. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. వన్ టౌన్ సీఐ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.