బెల్జియం: ఉత్తర బెల్జియంలోని బుగ్గెన్‌హౌట్‌లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ప్రయాణికుల రైలు.. స్కూల్మినీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు దాదాపు 15 మీటర్ల దూరం ఎగిరిపడి పక్కనే ఉన్న లోహపు స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. సదరు బస్సు లెర్నింగ్ డిసెబిలిటీస్ పిల్లల పాఠశాలకు చెందినదిగా స్థానిక మీడియా పేర్కొంది.
ప్రమాద సమయంలో బస్సులో ఏడుగురు విద్యార్థులు, ఓ సూపర్‌వైజర్, డ్రైవర్ ఉన్నారు. రైలులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన జరిగినప్పుడు రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని తెలిపారు. రైల్వే గేట్ క్రాసింగ్ వద్ద బారికేడ్లు మూసి ఉండి, రెడ్ సిగ్నల్ పడి ఉన్నట్లు ప్రాథమిక దృశ్యాల ద్వారా తెలుస్తోంది.
ఈ భయానక ప్రమాదంపై బెల్జియం ప్రధాన మంత్రి బార్ట్ డి వెవర్, ఉప ప్రధాన మంత్రి మాక్సిమ్ ప్రివోట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, నేడు బెల్జియంతో పాటు ఐరోపా అంతా శోకంలో మునిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.
