వైట్ బాల్ క్రికెట్ పక్కన పెడితే టెస్ట్ ఫార్మాట్ లో సొంతగడ్డపై ఏ జట్టయినా కింగే. ఇండియా, ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్లు బంగ్లాదేశ్ లో టెస్ట్ మ్యాచ్ ఆడి గెలవాలంటే అంత ఈజీ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే టెస్టుల్లో ఆతిధ్య జట్టుకు తిరుగుండదు. బంగ్లాదేశ్ నుంచి ఆస్ట్రేలియా వరకు సొంతగడ్డపై అని జట్లు చెలరేగిపోతాయి. ఇక ఈ విషయంలో భారత క్రికెట్ జట్టు అందరికంటే ఒక అడుగు ముందుకే ఉంటుంది. టీమిండియాతో స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ అంటే సిరీస్ కు ముందు ప్రత్యర్థి సగం ఆశలు వదులుకుంటుంది.
కొన్ని దశాబ్దాలుగా ఇది జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. విదేశాల్లో పర్వాలేదనిపిస్తున్న భారత క్రికెట్ జట్టు.. సొంతగడ్డపై పూర్తిగా నిరాశపరుస్తుంది. భారత గడ్డపై పెద్దగా అనుభవం లేని న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ మ్యాచ్ లు ఓడిపోయింది. 12 ఏళ్లుగా ప్రత్యర్థిని వణికిస్తూ ఒక్క సిరీస్ ఓడిపోకుండా విజయాలు సాధిస్తూ వచ్చిన టీమిండియా గత ఏడాది న్యూజి లాండ్ పై మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 0-3 తేడాతో వైట్ వాష్ కావడం షాకింగ్ గా మారింది. ఒక్క సిరీస్ పోయిందనుకుంటే పొరపాటే.
ఆదివారం (నవంబర్ 16) కోల్ కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయింది. సౌతాఫ్రికాతో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో 30 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీ జట్టు 1–0 లీడ్‌లో నిలిచింది. ప్రొటీస్ నిర్దేశించిన 124 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆదివారం బరిలోకి దిగిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 93 రన్స్‌కే కుప్పకూలింది. గత ఆరు టెస్ట్‌ల్లో భారత జట్టుకు ఇది నాలుగో ఓటమి కాగా.. 15 ఏండ్ల తర్వాత సౌతాఫ్రికా.. ఇండియా గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. స్వదేశంలో టీమిండియా ఓటమికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
సౌతాఫ్రికా క్రమశిక్షణ:
తొలి టెస్టు గమనిస్తే సౌతాఫ్రికా గాలివాటంగా గెలిచారనుకుంటే పొరపాటే. ఎందుకంటే భారత్ లాంటి పిచ్ లపై క్రమశిక్షగా ఆడితేనే విజయం వస్తుంది. ఈ విషయంలో సఫారీలు తూచా తప్పకుండా పాటించారు. ప్రతి ఒక్కరూ సమిష్టిగా ఆడి విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. బ్యాటింగ్ లో విఫలమైనా బౌలింగ్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ టీమిండియాపై ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బవుమా చేసి హాఫ్ సెంచరీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే వాళ్ళు ఉండడం సఫారీలకు కలిసొచ్చింది.
ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడం:
స్వదేశంలో భారత్ గెలవడం చాలా ఈజీ. తొలి టెస్టులో మాకు గెలుపు తిరుగులేదు అనుకోని బోల్తా పడ్డారు. తుది జట్టులో నలుగురు స్పిన్నర్లతో పాటు బుమ్రా, సిరాజ్ ఉండడంతో విజయంపై ధీమాగా కనిపించారు. పైగా సౌతాఫ్రికాకు గత 15 ఏళ్లలో ఒక్క విజయం కూడా లేకపోవడంతో మన జట్టు సఫారీలను సీరియస్ గా తీసుకోకుండానే ఆడినట్టు అనిపించింది. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం భారత్ పరాజయానికి ఒక కారణం.
►ALSO READ | రంజీ ట్రోఫీ హైదరాబాద్ తడబాటు
గిల్ లేకపోవడం:
సౌతాఫ్రికాపై తొలి టెస్ట్ ఓటమికి గిల్ లేకపోవడం ప్రధాన కారణం. ప్రస్తుతం టెస్టుల్లో సూపర్ ఫామ్ లో ఉన్న శుభమాన్ గిల్ రెండు ఇన్నింగ్స్ ల్లో అందుబాటులో లేడు. తపోలి ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులు చేసి మెడ గాయం కారణంగా గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు.ఆ తర్వాత బ్యాటింగ్ చేయడానికి రాలేకపోయాడు. హాస్పిటల్ లో చేరడంతో రెండో ఇన్నింగ్స్ లో కూడా ఈ టీమిండియా కెప్టెన్ అందుబాటులో లేడు. దీంతో 10 మందితోనే భారత జట్టు బ్యాటింగ్ చేసింది. గిల్ ఉంటే రెండు ఇన్నింగ్స్ ల్లో ఒక్క ఇన్నింగ్స్ లో ఆడినా ఫలితం వేరేలా ఉండేది.
స్పిన్ ఆడలేకపోవడం:
భారత జట్టు స్పిన్ ఎంత చక్కగా ఆడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎంతోమంది ప్రత్యర్థి స్టార్ స్పిన్నర్లకు భారత పర్యటన పీడకలగా మారింది. అయితే గత నాలుగేళ్లలో భారత్ స్పిన్ ఆడడంలో బాగా బలహీనంగా మారింది. హార్మర్ లాంటి అనుభవం లేని స్పిన్నర్ ను ఆడడంలో మనవాళ్లు విఫలం కావడం విచారకరం. పార్ట్ టైం బౌలర్ మార్కరం కూడా ప్రభావం చూపించాడు.
