పిల్లల్ని ఎత్తుకెళ్తారని సాధువులను కర్రలతో కొట్టిర్రు

పిల్లల్ని ఎత్తుకెళ్తారని సాధువులను కర్రలతో కొట్టిర్రు

పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే అనుమానంతో మహారాష్ట్రలో నలుగురు సాధువులపై ఓ బృందం దాడి చేసింది. సాంగ్లీ జిల్లాలోని లవణ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన నలుగురు సాధువులు కర్ణాటకలోని బీజాపూర్కు వెళ్లి అక్కడి నుంచి పండరీపురానికి పయనమయ్యారు. దారిలో లవణ గ్రామంలో ఓ పిల్లవాడిని అడ్రస్ అడిగారు. దీంతో వారిపై అనుమానం వచ్చి స్థానికులు వాగ్వాదానికి దిగారు. నలుగురు సాధువులను పిల్లలను ఎత్తుకపోయే ముఠాగా అనుమానించి కర్రలతో దాడి చేశారు.

పోలీసులు ఘటనాస్థలికి చేసుకుని సాధువులను విచారించారు. ఈ విచారణలో వారు మథురలోని శ్రీ పంచనం జునా అఖాడాకు చెందినవారిగా గుర్తించారు. తమను గ్రామస్థులు అపార్థం చేసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని సాధువులు తెలపగా.. తాము కూడా అవగాహన లోపం వల్లే దాడి చేశామని గ్రామ ప్రజలు చెప్పారు. ఇరువర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనను మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ తీవ్రంగా ఖండించారు. సాధువులతో ఇలాంటి అనుచిత ప్రవర్తనను తమ ప్రభుత్వం సహించదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం ఈ ఘటనను దురదృష్ణకరమని తెలిపింది. సాధువులను హత్య చేసే ఈ దాడి ఉందని ఆనంద్ దూబే అన్నారు. ప్రభుత్వం హిందువులతో ఉందో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.