- తొలి మ్యాచ్‌లో బెంగళూరు X ముంబై
- రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
నవీ ముంబై: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌కు సర్వం సిద్ధమైంది. తొలి వన్డే వరల్డ్ కప్ గెలిచి మంచి జోరుమీదున్న ఇండియన్ క్రికెటర్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్లు ఈ లీగ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రాణించి జూన్, జులైలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో తమ సత్తా ఏంటో చూపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై.. బెంగళూరుతో తలపడనుంది. 2023, 2025లో టైటిల్ నెగ్గిన హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని ముంబై జట్టు పేపర్ మీద చాలా బలంగా కనిపిస్తోంది. సివర్ బ్రంట్ (ఇంగ్లండ్), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) రాకతో జట్టు బ్యాటింగ్ బలోపేతం అయ్యింది. ఎక్కువ మంది సభ్యులను రిటేన్ చేసుకున్న ముంబైకి మిగతా జట్లతో పోలిస్తే బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉంది. అమెలియా కెర్ర్, మిలీ ఇల్లింగ్‌వర్త్, అమన్‌జోత్ కౌర్, కమళిని కీలకం కానున్నారు. అయితే ఎక్కువగా టాలెంటెడ్ ప్లేయర్లు ఉండటంతో తుది జట్టు ఎంపిక కత్తిమీద సాముగా మారింది. బౌలింగ్‌లో షబ్నమ్ ఇస్మాయిల్, సైకా ఇషాకి సూపర్ ఫామ్‌లో ఉన్నారు. గత రెండేళ్లు ఈ ఇద్దరు మంచి పెర్ఫామెన్స్ చూపెట్టారు.
స్మృతిపైనే భారం..
ఈసారి కొన్ని మార్పులతో బెంగళూరు కూడా లీగ్‌కు రెడీ అయ్యింది. అయితే బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ స్మృతి మంధానాపైనే పడనుంది. ఎలైస్ పెర్రీ ఈ సీజన్ నుంచి తప్పుకోవడం వాళ్లకు మైనస్‌గా మారింది. మంధానాతో కలిసి జార్జియా వోల్ ఓపెనింగ్ చేసే చాన్స్ ఉంది. హేమలత, గౌతమీలో ఒకరు మూడో ప్లేస్‌లో బ్యాటింగ్‌కు రావొచ్చు. గ్రేసీ హారిస్, రిచా ఘోష్, నాడిన్ డిక్లెర్క్ చెలరేగితే ముంబై బౌలర్లకు కష్టాలు తప్పవు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శ్రేయంక పాటిల్ తిరిగి రావడం ఆర్సీబీకి కాన్ఫిడెన్స్ పెంచే అంశం. 2023 డెబ్యూ సీజన్ అప్పుడు ఆమెకు 20 ఏండ్లు. ఆ ఏడాది చివర్లో టీ20, వన్డే క్యాప్‌లను అందుకున్న పాటిల్ విమెన్స్ క్రికెట్‌లో చాలా వేగంగా ఎదిగింది. 2024లో సూపర్ పెర్ఫామెన్స్ చూపెట్టడంతో పాటు ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. అరుంధతి రెడ్డి, లారెన్ బెల్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, సయాలీ సట్గరే కూడా మెరిస్తే బెంగళూరు బౌలింగ్ కష్టాలు తీరినట్లే.
కెప్టెన్‌గా జెమీమా.
వేలం తర్వాత మిగతా జట్లలోనూ మార్పులు చేర్పులు జరిగాయి. మెగ్ లానింగ్ యూపీ వారియర్స్‌కు వెళ్లడంతో స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించనుంది. 2023లో తన బ్యాట్ పవర్ చూపెట్టిన జెమీమా ఈసారి నాయకత్వ లక్షణాలను కూడా ప్రదర్శించాల్సి ఉంటుంది. మూడుసార్లు ఫైనల్‌కు చేరినా కప్ అందుకోవడంలో ఫెయిలైన ఢిల్లీ కనీసం ఈసారైనా టైటిల్‌ను సాధిస్తుందా? చూడాలి. క్యాపిటల్స్ జట్టు కూడా బలంగానే కనిపిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే చాలా దూరం వెళ్తారు. షెఫాలీ వర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, లారా వోల్‌వర్ట్ ఉండటం కలిసొచ్చే అంశం. రెండేళ్లు పేలవంగా ఆడిన గుజరాత్ జెయింట్స్ గతేడాది ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. కాబట్టి ఈసారి పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని లక్ష్యంగా పెట్టుకుంది. గాడ్నెర్ నేతృత్వంలో స్వదేశీ, విదేశీ స్టార్లకు కొదువలేదు. టిటాస్ సాధూ, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, యాస్తికా భాటియా మెరవాల్సి ఉంది. బెత్ మూనీ, సోఫీ డివైన్, కిమ్ గార్త్, జార్జియా వేర్‌హామ్‌లాంటి నాణ్యమైన విదేశీ ప్లేయర్లు ఉండటం కలిసొచ్చే అంశం. చాలా మార్పుల తర్వాత యూపీ వారియర్స్ కూడా కొత్తగా కనిపిస్తోంది. కాకపోతే షిప్రా గిరి మినహా స్పెషలిస్ట్ వికెట్ కీపర్ లేకపోవడం లోటుగా ఉంది. ఫిట్‌నెస్‌తో ఉంటే ప్రతీకా రావల్, కిరణ్ నవ్‌గిరే, లిచ్‌ఫీల్డ్ చాలా బలంగా ప్రభావం చూపే ప్లేయర్లు. హర్లీన్ డియోల్, మెగ్ లానింగ్ మిడిల్ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తే సరిపోతుంది. దీప్తి శర్మ, ట్రయాన్, డాటిన్, శిఖా పాండే, క్రాంతి గౌడ్, సోఫీ ఎకెల్‌స్టోన్ నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే వీళ్లందర్నీ ఏకతాటిపై నడిపించాల్సిన బాధ్యత మాత్రం లానింగ్‌పై ఉంది.
