దేవులపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో గోల్మాల్

 దేవులపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో గోల్మాల్
  • కేంద్రం ప్రారంభించకుండా  అడ్డుకున్న గ్రామస్తులు

గద్వాల, వెలుగు: వడ్ల కొనుగోలు సెంటర్  ముసుగులో గతంలో రూ.16 లక్షలు స్వాహా చేసిన ఘటన ధరూర్  మండలం దేవులపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. అక్రమాలకు పాల్పడిన నిర్వాహకుల ఆధ్వర్యంలో శనివారం వడ్ల కొనుగోలు సెంటర్​ను ప్రారంభిస్తుండగా, డబ్బులు స్వాహా చేసిన వారిని తొలగించాలని డిమాండ్  చేస్తూ రైతులు, గ్రామస్తులు, యువకులు సెంటర్  ఓపెన్  చేయకుండా అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ధరూర్  మండలం రేవులపల్లి కొనుగోలు సెంటర్ కు సంబంధించి లావాదేవీల వివరాలను గ్రామానికి చెందిన వాయు రామన్న ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకొని సేకరించాడు.

 గ్రామానికి చెందిన వీవోఏతో పాటు సంఘం అధ్యక్షురాలు కొనుగోలు సెంటర్ లో ఎలాంటి సౌలతులు కల్పించకుండా, కుటుంబ సభ్యుల పేరు మీద చెక్కులు డ్రా చేసుకున్నట్లు తేలింది. మహిళా సంఘం అధ్యక్షురాలి పదవీకాలం ముగిసి నెల రోజులు గడిచినప్పటికీ, కొత్త అధ్యక్షురాలిని ఎన్నుకోలేదు. ఇప్పుడు కొనుగోలు సెంటర్  ద్వారా వీవోఏతో పాటు అప్పటి సంఘం అధ్యక్షురాలు మళ్లీ అక్రమాలు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ సెంటర్ ను ఓపెన్  చేయకుండా అడ్డుకున్నారు. స్వాహా చేసిన డబ్బులు రికవరీ చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్  చేశారు.