నకిలీ పహానీలతో రూ.48 లక్షల లోన్లు

నకిలీ పహానీలతో రూ.48 లక్షల లోన్లు

వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పినపాక మండలంలో నకిలీ పహానీలతో రూ.40లక్షల లోన్లు పొంది ఎస్బీఐకి కుచ్చుటోపీ పెట్టిన వైనంపై ఏడూళ్ల బయ్యారం పోలీసులు మంగళవారం గుట్టురట్టు చేశారు. ఈ మేరకు ఏడూళ్ల బయ్యారం సీఐ అశోక్​విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన పినపాక తహసీల్దార్ జగదీశ్వర్ ప్రసాద్​నకిలీ పహానీల విషయమై ఫిర్యాదు చేశారన్నారు. విచారణ చేపట్టగా ఎస్ బీఐ ఏడూళ్ల బయ్యారం శాఖలో 41 నకిలీ పహానీలతో రూ.48లక్షలు అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అందులో భాగంగా ప్రధాన సూత్రధారుడిగా మద్దులగూడెంకు చెందిన పండా నర్సింహారావును గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇతనితో పాటు విచారణలో మరో 10 మందిని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.

ప్రధాన నిందితుడు పండా నర్సింహారావు, మణుగూరు పట్టణానికి చెందిన దేవీ కృష్ణ అనే మీ సేవ సెంటర్ నిర్వాహకుడు కూడా ఉన్నారని తెలిపారు. మీ సేవ నిర్వాహకుల వద్ద ఖాళీ మీ సేవ పత్రాలను కొనుగోలు చేసి అదే పట్టణంలో గణేశ్ ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్న శ్యామల సాంబశివరావుతో కలిసి ఈ తతంగం నడిపించారన్నారు. ఇలాంటి మీ సేవ పహానీలు పొందిన రైతుల వద్ద నుంచి మధ్యవర్తుల ద్వారా ఏజెంట్ల సాయంతో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.5వేల నుంచి రూ.10వేలు వరకు డబ్బులు తీసుకున్నారని విచారణలో తేలిందన్నారు. ఇలా నకిలీ పహానీలతో రుణాలు పొందారని తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో పినపాకకు చెందిన పరిమి నర్సింహారావు, జాడి రమేశ్, బి.ఏసుబాబు, కొడారి నాగేశ్వరరావు, సమ్మారావు, కొండేరు వెంకటేశ్వర్లు, వారా నాగేశ్వరావు ఉన్నారని వెల్లడించారు. పినపాకలో ఉన్న మరో రెండు బ్యాంకుల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరిగినట్లు తెలిసిందన్నారు . ఈ కుంభకోణంలో దాదాపు రూ.3కోట్ల వరకు లోన్ల రూపంలో దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది . అలాగే మణుగూరు, అశ్వాపురం బ్యాంకుల్లో కూడా సమగ్ర విచారణ జరిపితే కుంభకోణం గుట్టురట్టు అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.