గేమ్ చేంజర్‎గా ఫ్రీ బస్.. దేశంలో మన మహిళల ప్రయాణ ఖర్చే తక్కువ 

గేమ్ చేంజర్‎గా ఫ్రీ బస్.. దేశంలో మన మహిళల ప్రయాణ ఖర్చే తక్కువ 
  •    జాతీయ ప్రయాణ ఖర్చు సగటు రూ. 533
  • తెలంగాణ మహిళల వ్యయం రూ. 420 మాత్రమే
  • రాష్ట్రంలో 365 కోట్ల ఉచిత ప్రయాణాలు 
  • తెలంగాణ మహిళలకు రూ.12,650 కోట్లు మిగులు
  • 57.6 శాతం మంది బైకులపైనే ఆఫీసులకు..
  • 37 శాతం మంది కాలినడకన స్కూళ్లకు
  • ‘నేషనల్​ హౌస్‌‌‌‌‌‌‌‌హోల్డ్​ ట్రావెల్’​ సర్వేలో వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణలో మహిళలకు ఫ్రీబస్​ స్కీమ్ ఆర్థికంగా ఊతమిస్తున్నది. నెలవారీ ప్రయాణ సగటు ఖర్చులను తగ్గించి.. మహిళల ఆర్థిక సాధికారతకు బాటలు వేస్తున్నది. ఈ విషయం  కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా తొలిసారిగా కేంద్ర గణాంక శాఖ.. ‘నేషనల్​ హౌస్​హోల్డ్​ ట్రావెల్​ సర్వే 2025–26 ఫ్యాక్ట్​ షీట్​’లో ప్రజల ప్రయాణ ఖర్చుల వివరాలను వెల్లడించింది.

 ఫ్రీ బస్​ స్కీమ్​లేని రాష్ట్రాలతో పోలిస్తే.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ, ఢిల్లీ, కర్నాటక, తమిళనాడులాంటి రాష్ట్రాల్లో మహిళల రవాణా ఖర్చు చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. దేశంలో ఒక మహిళా ఉద్యోగి నెలవారీ సగటు ప్రయాణ ఖర్చు రూ.533 కాగా, తెలంగాణలో రూ.420 మాత్రమే ఉన్నట్టు వెల్లడైంది. 

పురుషుల ట్రావెల్​ఖర్చు మాత్రం దేశ సగటుతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉండడం గమనార్హం. దేశంలో ఇది రూ.835 ఉండగా.. మన రాష్ట్రంలో ట్రావెల్​ కోసం  పురుషులు రూ.932  ఖర్చు చేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది.  కాగా, సిటీల్లోని 29 శాతం మంది మహిళలు బస్సుల్లోనే ఆఫీసులకు వెళ్తున్నట్టు సర్వే​ స్పష్టం చేసింది.

దేశ సగటు 22 శాతంతో పోలిస్తే మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అంటే పబ్లిక్​ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌లో మనమే మెరుగ్గా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. అలాగే, మన దగ్గర సిటీలో సగటు ప్రయాణ సమయం 27 నిమిషాలు కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలుగా ఉంది. ఇది జాతీయ సగటుకు దాదాపు సమానం. రాష్ట్రంలో ఆరేండ్లు పైబడిన స్టూడెంట్లు ఇంటి నుంచి బడి లేదా కాలేజీకి చేరుకోవడానికి సగటున 26 నిమిషాల సమయం పడుతున్నట్టు తేలింది.  

 37 % మంది స్టూడెంట్లు నడిచే స్కూల్‌‌కు..

దేశవ్యాప్తంగా ఆరేండ్లపైన ఉన్న విద్యార్థుల్లో 66.4% మంది కిలోమీటరు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించి బడులు లేదా కాలేజీలకు వెళ్తున్నారు. ఒక కిలోమీటర్​ కంటే ఎక్కువ దూరం వెళ్లే విద్యార్థుల్లో అత్యధికంగా 37 శాతం మంది స్కూళ్లు, కాలేజీలకు నడిచే వెళ్తున్నట్టు రిపోర్టు తేల్చింది. పల్లెల్లో 40.5%, నగరాల్లో 29.6% మంది స్టూడెంట్లు కాలినడకన వెళ్తున్నారు. 6–14 ఏండ్ల పిల్లల్లో అయితే ఏకంగా 47.3% మంది నడిచి బడికి వెళ్తుండడం గమనార్హం. 

29.5 శాతం మంది విద్యార్థులు బస్సులు, 15.8 శాతం మంది సైకిళ్లపై వెళ్తున్నారు. 15–29 ఏండ్ల యువతలో 21.4% మంది సైకిళ్లపైనే కాలేజీలకు వెళ్లడం విశేషం. ఆటోల్లో 10.5%, టూవీలర్లపై 6.7%, కార్లలో 0.7% మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. దేశంలో విద్యార్థుల నెలవారీ సగటు ప్రయాణ ఖర్చు రూ.443గా ఉంది. పల్లెల్లో రూ.361.. సిటీల్లో 617 రూపాయలు ఖర్చవుతున్నది. 

బైకులపై ఆఫీసులకు

ఆఫీసులకు వెళ్లేవాళ్లలో ఎక్కువ మంది బైకు ప్రయాణాలనే నమ్ముకుంటున్నారు. 57.6 శాతం మంది ద్విచక్ర వాహనాలను వాడుతున్నారు. పురుషులు 61.9 శాతం.. మహిళలు 41.9 శాతం మంది బైకులపై ఆఫీసులకు వెళ్తున్నారు. దేశంలో ఇప్పటికీ 28.3 శాతం మంది నడిచే పనికి వెళ్తున్నారు. సైకిళ్లపై 10.7%, బస్సుల్లో 6.7%, ఆటోల్లో 6.4%, కార్లలో 3.0%, లోకల్ రైలు/మెట్రోల్లో 2.1% మంది ప్రయాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా పని ప్రదేశానికి వెళ్లి రావడానికి ఒక ఉద్యోగికి నెలకు సగటున రూ.785 ఖర్చవుతోంది. ఇది నగరాల్లో అయితే రూ.1044.. పల్లెల్లో రూ.612గా ఉంది.  

మన మహిళలకు రూ.12,650 కోట్లు ఆదా!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలోని మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు బాటలు వేస్తూ ముందుకు సాగుతున్నది. స్కీమ్‌‌ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ మహిళల ప్రయాణ ఖర్చులు రూ.12,650 కోట్లు ఆదా అయినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

 365 కోట్ల ప్రయాణాలు జరగడం విశేషం. ఏటా ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2025 మూడో త్రైమాసికంలో 34.67 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా, 2026 మూడో త్రైమాసికంలో ఆ సంఖ్య ఏకంగా 35.65 కోట్లకు చేరింది. గత ఏడాది అదే టైంతో పోలిస్తే అదనంగా 97.20 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.