ఫీలింగ్స్​ను షేర్ చేసుకోండిలా.. అందుబాటులో ఫ్రీ కౌన్సెలింగ్ సర్వీసులు

ఫీలింగ్స్​ను షేర్ చేసుకోండిలా.. అందుబాటులో ఫ్రీ కౌన్సెలింగ్ సర్వీసులు
  •      క్వాలిఫైడ్ టీమ్​తో మాట్లాడిస్తూ సలహాలు, సూచనలు ​
  •       కాల్స్, ఈ– మెయిల్ ద్వారా సమస్యలను చెప్పుకునే చాన్స్
  •      ఫెసిలిటీస్ కల్పిస్తున్న పలు సంస్థలు, స్టార్టప్‌‌‌‌లు

 బాధ, చిరాకులో ఉన్నప్పుడు ఫీలింగ్స్​ను ఇతరులతో షేర్ చేసుకోవాలని ఉన్నా ఒక్కోసారి తెలిసిన వాళ్లతో చెప్పుకోవడానికి మనసొప్పదు. మన ఫ్రస్ట్రేషన్, బాధను చూపించి ఎదుటివారి ముందు చులకన అవకూడదని చాలామంది భావిస్తుంటారు. అలా అని ఎవరికీ చెప్పుకోకుండా ఉండలేరు. ఆ సమయంలో ఎవరో ఒకరితో మాట్లాడితే రిలీఫ్ అవుతారు. అలాంటివారిని ఓదార్చి, వారికి ధైర్యం చెప్పే సర్వీసులను అందిస్తున్నాయి సిటీకి చెందిన పలు సంస్థలు, స్టార్టప్‌‌‌‌లు. ఇటీవలి కాలంలో డిప్రెషన్‌‌‌‌తో సతమతమవుతున్న వారు పెరుగుతుండటంతో ఇలాంటి సంస్థలకు ఆదరణ పెరుగుతోంది. బాధితుల వివరాలు తెలుసుకోకుండా వారికి కావాల్సిన సూచనలు, సలహాలు ఇస్తూ పరిస్థితుల నుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తున్నాయి ఈ సంస్థలు.

హైదరాబాద్, వెలుగు: ఒత్తిడి, ఆందోళనను దూరం చేసేందుకు సిటీకి చెందిన కొన్ని సంస్థలు టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచాయి. ‘లైఫ్ ఆఫ్ గర్ల్’ అనే స్టార్టప్ కంపెనీ లాక్ డౌన్ సమయంలో ‘ఐయామ్ హియర్ నో ఫియర్’ అనే వెబ్ సైట్ డిజైన్ చేసింది. ఈ వెబ్ సైట్ లో ఒక ర్యాండమ్ పర్సన్ తో ఇంకో ర్యాండమ్ పర్సన్ కాల్ మాట్లాడటం, చాట్ చేయడం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సంస్థ తరఫున 20 మంది వాలంటీర్లు పనిచేస్తూ ఒంటరితనాన్ని పోగొట్టడానికి, స్ట్రెస్ లెవల్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంటారు. వీరిలో ఎక్స్ పర్ట్స్, సెలబ్రిటీలు, కార్పొరేట్ ఉద్యోగులతోపాటు స్టూడెంట్లు, హోమ్ మేకర్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ప్రతి రోజు 20 నుంచి 30 రిక్వెస్టులు వస్తుండగా.. వారి ప్రాబ్లమ్ ను తెలుసుకుని వాలంటీర్లతో కాల్స్ మాట్లాడిస్తున్నారు. జాబ్ టెన్షన్, ఒంటరితనం, వర్క్ ప్రెజర్ కారణాలతో ఎక్కువ కాల్స్​వస్తున్నాయని.. కాల్స్ చేస్తున్నవారిలో 16 నుంచి 30 ఏండ్లలోపు వారే ఎక్కువగా ఉంటున్నారని స్టార్టప్‌‌‌‌ ప్రతినిధులు చెప్తున్నారు.

వయసు, భాష, జెండర్​ను దృష్టిలో ఉంచుకొని..

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హ్యూమన్ ఎకాలజీ ఆధ్వర్యంలో ఫోన్, ఈ– మెయిల్ బేస్డ్ కౌన్సెలింగ్ సర్వీసులు అందిస్తున్నారు. ‘ఐ కాల్’ పేరుతో ఫ్రీ కౌన్సెలింగ్ సెషన్స్ అందుబాటులో ఉంటున్నాయి. మానసికంగా ఒత్తిడికి గురికావడం, ఇతర విషయాలకు తీవ్రంగా బాధపడుతండటం వంటి సమస్యలపై వయసుల వారీగా.. భాష, జెండర్​ను దృష్టిలో ఉంచుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. క్వాలిఫైడ్ టీం, ట్రైయిన్డ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్​తో సలహాలు, సూచనలు ఇప్పిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ  సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి.

మెడిటేషన్‌‌‌‌తో.. 

మెడిటేషన్​తో స్ట్రెస్, వర్క్ ప్రెజర్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. మెడిటేషన్​తో అసంతృప్తిని, అసహనాన్ని దూరం చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. సిటీలోని హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ సెంటర్ ‘సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్’(పీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఏ) పేరుతో పబ్లిక్ కోసం హెల్ప్‌‌‌‌ లైన్​ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మెడిటేషన్​తో సమస్యలు తొలగిపోతాయని చెప్పేందుకు 2021లో ఈ సర్వీసులను గ్లోబల్ గైడ్ ఆఫ్ హార్ట్‌‌‌‌ఫుల్​నెస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు 8448–8448–45 నంబర్​కు కాల్​చేసి సమస్యలు చెప్పుకుంటే..  ట్రైయిన్డ్ కౌన్సెలర్లు ఆ సమస్యల నుంచి బయటకు తీసుకువచ్చే మార్గాలు, సూచనలు ఇస్తున్నారు. ఇక్కడ చాట్ ఆప్షన్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఫ్రెండ్స్​తో మాట్లాడినట్లుగా.. 

ఈ మధ్య కాలంలో చాలామంది మెంటల్ స్టెబిలిటీ కోల్పోతున్నారు. తెలిసిన వాళ్లతో సమస్య చెప్పుకుంటే వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో, తర్వాత ఏమంటారో అనే అపోహలతో చెప్పుకోవడానికి ఇష్టపడరు. తెలియని వ్యక్తితో మాట్లాడితే ఆ సమస్య ఉండదు. అందుకోసమే మేం ఓ వెబ్ సైట్ క్రియేట్ చేశాం. వెబ్​సైట్​లో రిక్వెస్ట్ చేసుకుంటే మా వలంటీర్ వాళ్లతో మాట్లాడతారు. బాధితుల జెండర్, వయసుని బట్టి వలంటీర్లకు కాంటాక్ట్ షేర్ చేస్తాం. ఇందులో మాట్లాడొచ్చు, చాట్ కూడా చేసుకోవచ్చు. –విజ్ఞాన్, లైఫ్​ఆఫ్​గర్ల్ వెబ్ సైట్ క్రియేటర్