స్మార్ట్​ మీటర్లు పెట్టినా ఫ్రీ కరెంట్​ ఇవ్వొచ్చు : బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి

స్మార్ట్​ మీటర్లు పెట్టినా ఫ్రీ కరెంట్​ ఇవ్వొచ్చు : బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి
  •  కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసుడు సరికాదు 
  • విద్యుత్​ అక్రమాలపై హౌస్​ కమిటీ వేయాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: స్మార్ట్​ మీటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసుడు సరికాదని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అన్నారు. ఇప్పుడన్నీ ప్రీపెయిడ్​లు అయిపోయాయని, ఫోన్ల రీచార్జ్​ కూడా ప్రీపెయిడ్​ చేసి వాడుకుంటున్నామని చెప్పారు. కరెంట్​ స్మార్ట్​ మీటర్లు పెట్టుకుంటే ఎంత కావాలో ముందే కొనుక్కునేందుకు అవకాశం ఉంటుందని, ఫలితంగా నష్టాలూ తగ్గుతాయని అన్నారు.

 స్మార్ట్​ మీటర్లు పెడితే ఉచిత విద్యుత్​ ఇవ్వడం సాధ్యం కాదన్నది నిజం కాదని, ఫ్రీ కరెంట్​ ఇవ్వొచ్చని అన్నారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్​ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్​ కొనుగోళ్ల అక్రమాలపై కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నేతలు హౌస్​ కమిటీకి ఒప్పుకుంటున్నందున.. హౌస్​ కమిటీని వేసి విద్యుత్​ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. రైతులకు కావాల్సిన కరెంట్​ సామగ్రి అందట్లేదని చెప్పారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారుగానీ,  కరెంట్​ డిపోలను మాత్రం పెట్టలేదన్నారు.

 ప్రతి జిల్లాకో కరెంట్​ డిపోను ఏర్పాటు చేయాలని కోరారు. ట్రాన్స్​ఫార్మర్ల కోసం రైతులు విజ్ఞప్తి చేసినా ఇచ్చే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. ప్రభుత్వ స్థలమా, ప్రైవేటు స్థలమా అన్నది తేల్చకుండానే.. అక్కడ నిర్మాణాలు చేస్తారా చెయ్యరా అనేది తెలుసుకోకుండానే కరెంట్​ పోల్స్​ వేసి తీగలను వేశారని చెప్పారు.  మీటర్​ రీడింగ్​ తీస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. 

సభ తీరు చూస్తుంటే విమర్శలు, ప్రతి విమర్శలకే సరిపోతున్నదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాను సభకు కొత్తేమోగానీ.. రాజకీయాలకు కాదన్నారు. సభలో 50 మంది కొత్త సభ్యులం ఉన్నామని, తామంతా సీనియర్ల నుంచి నేర్చుకునేలా సభ ఉండాలని సూచించారు.