పెద్దోళ్ల ఇళ్లలో అన్నం అడిగిన.. ఇప్పుడు వాళ్ల పిల్లలకే పాఠాలు చెప్తున్న: మామిడాల రాములు

పెద్దోళ్ల ఇళ్లలో అన్నం అడిగిన.. ఇప్పుడు వాళ్ల పిల్లలకే పాఠాలు చెప్తున్న: మామిడాల రాములు
  •     చదువు వల్లే ఇది సాధ్యమైంది: ప్రొఫెసర్  మామిడాల రాములు
  •     ఏరో స్పేస్ రంగంలో కొలువులకు కొదవలేదని వెల్లడి
  •     థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్  కూడా తప్పనిసరని సూచన

హైదరాబాద్, వెలుగు: ‘‘పెద్దోళ్ల ఇళ్లలో ఒకప్పుడు అన్నం కోసం అడిగే స్థాయి నుంచి.. ఇప్పుడు అదే పెద్దోళ్ల పిల్లలకు పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగానంటే దానికి కారణం చదువు మాత్రమే. ఎవరినైనా ఉన్నత స్థానంలో నిలబెట్టే ఏకైక ఆయుధం విద్యే’’ అని అమెరికాలోని సియాటిల్  వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్, ప్రముఖ బోయింగ్  శాస్త్రవేత్త మామిడాల రాములు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని అంబేద్కర్  ఓపెన్  యూనివర్సిటీలో జరిగిన ఇంటరాక్టివ్  సెషన్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏరో స్పేస్ రంగం, ఉపాధి అవకాశాలు, తన జీవిత ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తెలంగాణ బిడ్డగా గర్వపడుతున్నా..

తెలంగాణ విమానయాన తయారీ రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు తనవంతు సాయం చేస్తానని రాములు మాటిచ్చారు. ఏరో స్పేస్ రంగంలో నిపుణులకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని, అయితే థియరీ చదివి మార్కులు తెచ్చుకుంటే సరిపోదని, ప్రాక్టికల్  నాలెడ్జ్  ఉంటేనే ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలమని ఆయన స్పష్టం చేశారు. తాను జనగామ ప్రాంతం నుంచి వచ్చిన సామాన్యుడినని, సంక్షేమ హాస్టళ్లలోనే చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. 

దొరల మాటలు విని తనను చదివించొద్దని తల్లిదండ్రులు అనుకున్నా, పట్టుబట్టి చదివి ఈ స్థాయికి వచ్చానన్నారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుజీవితం గడిపానని, ఒక తెలంగాణ బిడ్డగా బోయింగ్  సంస్థలో ఉన్నత అధికారిగా ఎదగడం గర్వంగా ఉందన్నారు. 

రాములు జీవితం యువతకు స్ఫూర్తి: ఘంటా చక్రపాణి

గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాషింగ్టన్  వర్సిటీలో ప్రొఫెసర్‌గా రాణించడం సామాన్య విషయం కాదని అంబేద్కర్  ఓపెన్  వర్సిటీ వీసీ ప్రొఫెసర్  ఘంటా చక్రపాణి అన్నారు. ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొని ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగిన మామిడాల రాములు నేటి యువతకు నిజమైన స్ఫూర్తి అని ఆయన కొనియాడారు. బోయింగ్ విమానాల రూపకల్పనలో రాములు చేసిన పరిశోధనలు అద్భుతమని ప్రశంసించారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏరో స్పేస్ డైరెక్టర్  ప్రవీణ్, హెచ్‌సీయూ ప్రొఫెసర్  పిల్లలమర్రి రాములు, ఓయూ మాజీ రిజిస్ట్రార్  లక్ష్మీనారాయణ, రిజిస్ట్రార్  ఎల్.విజయకృష్ణారెడ్డి, డాక్టర్  గుర్రం సీతారాములు తదితరులు పాల్గొన్నారు.