- అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న సంస్థ
గోదావరిఖని/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, అవసరాల మేరకు వాడుకోవడంలో సింగరేణి సంస్థ ముందంజలో ఉంది. భూగర్భ గనుల్లో బొగ్గును వెలికి తీయడం, దానిని ఉపరితలానికి తరలించేందుకు గతంలో మాన్యువల్ విధానాలు పాటించగా... ప్రస్తుతం ఎల్‌హెచ్‌డీ, ఎస్‌డీఎల్, కంటిన్యూయస్ మైనర్, లాంగ్ వాల్ విధానాలను వాడుతున్నారు. తట్ట, చెమ్మాస్‌తో ఒక్కో కార్మికుడు రెండు టన్నుల బొగ్గు తీయడమే గగనంగా మారిన ఒకప్పటి రోజుల నుంచి కంటిన్యూయస్ మైనర్ మెషీన్ ఒక్కటే 1500 టన్నుల బొగ్గు తీసే స్థాయికి చేరింది.
అలాగే లాంగ్ వాల్ విధానం ద్వారా రోజుకు ఏడు వేల టన్నుల వరకు బొగ్గు వస్తోంది. మరో వైపు సింగరేణి కార్మికులు గతంలో గనుల్లోకి నడుచుకుంటూ వెళ్లి.. నడుచుకుంటూనే వచ్చేవారు. ప్రస్తుతం మ్యాన్ రైడింగ్ చైర్ కార్‌లను ప్రవేశపెట్టడంతో కార్మికుల శ్రమ తగ్గింది.
