కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వివేక్..మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మీడియాతో మాట్లాడిన మంత్రి వివేక్ ..‘ కేటీఆర్, హరీష్ రావు సింగరేణి నిధులను సిరిసిల్ల, సిద్దిపేట తరలించి చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారు.. ఆ నిధులతోనే సిద్దిపేటలో పెద్ద స్టేడియం కట్టించారు. బొగ్గు గనుల ప్రాంతంలో పొల్యుషన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వస్తున్న హరీష్ రావు ముందుగా ఇక్కడి డిఎంఎఫ్టీ నిధులను ఎందుకు తరలించారో ప్రజలకు సమాధానం చెప్పాలి. సింగరేణిలో కొత్త బొగ్గు గనులు వస్తే ఉపాధి అవకాశాలు వస్తాయని ఏళ్లుగా ప్రజలు ఉద్యమించారు..బొగ్గు బ్లాక్ల కేటాయింపు కోసం కేంద్రం అమలు చేస్తున్న వేలం పాటలో సింగరేణి కంపెనీని పాల్గొనకుండా గత బీఆర్ఎస్ సర్కార్ అడ్డుకుంది.. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల సింగరేణిలో కొత్త బొగ్గు గనులు రాలేదు. కేబినెట్లో కీలకమైన మంత్రి బాధ్యతలో కొనసాగిన హరీష్ రావు సింగరేణి ప్రాంతంలో బొగ్గు గనుల రాకుండా అడ్డుకున్న విషయంపై సమాధానం చెప్పాలి. చెన్నూరు నియోజకవర్గంలో కేవలం 250 డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిన బీఆర్ఎస్ సర్కార్ మిగిలిన 2లక్షల మంది ప్రజల విషయంలో ఎందుకు అన్యాయం చేశారో చెప్పాలి. నిరుద్యోగభృతి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారు.
కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ప్రాజెక్టు కోసం చెన్నూరు నియోజకవర్గంలోని దేవులవాడ,బబ్బెరచెలక,లక్ష్మిపూర్లో రైతుల నుంచి భూములు తీసుకున్నారు. భూములు కోల్పోయిన రైతులకు రూ.33 కోట్ల పరిహారం ఇవ్వకుండా నాలుగేండ్లు ఇబ్బందులు పెట్టారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ ను ఒప్పించి భూములు కోల్పోయిన రైతులకు రూ.28కోట్ల పరిహారం మంజూరు చేయించా. త్వరలో రైతులకు పంపిణి చేస్తం. చెన్నూరు ప్రజలపై చిత్తశుద్ది ఉంటే రెవెన్యూ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు ఎందుకు పరిహారం ఇప్పించలేదో సమాధానం చెప్పాలి. పదేండ్ల బీఆర్ఎస్ హయంలో చెన్నూరు నియోజకవర్గంలోని గ్రామాలు,పట్టణాల్లో కనీసం రోడ్లు,డ్రైయినేజీలు,తాగునీటీ సౌలత్లను కల్పించలేదు.
రూ.60 వేల కోట్ల మిషన్ భగీరథ స్కీం ద్వారా చుక్కనీరు రాలేదు. కమీషన్ల కోసం బీఆర్ఎస్ లీడర్లు మిషన్ భగీరథ,కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టారు. కల్వకుంట్ల కుంటుంబం కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిని ప్రపంచంలోనే ధనవంతుడిని చేసి వేల కోట్ల కమీషన్లను దోచుకుంది. క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సప్లై చేసేందుకు రూ.40కోట్ల నిధులతో అమృత్ స్కీం పనులు చేపట్టాం. నేను పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలో కేంద్రం నుంచి క్యాతనపల్లి రైల్వే గేట్ వద్ద ఆర్వోబీని మంజూరు చేయించా. పదేండ్ల బీఆర్ఎస్ హయంలో ఆర్వోబీ కనెక్టింగ్ రోడ్ నిర్మించలేదు. రైల్వే గేటు వద్ద ఆర్వోబీ లేక ప్రమాదాలు జరిగి పలువురు చనిపోయారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత కనెక్టింగ్ రోడ్ నిర్మించి ఆర్వోబీని అందుబాటులోకి తీసుకవచ్చా. ఆర్వోబీపై లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయించా.
చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన డీఎంఎఫ్టీ,సీఎస్ఆర్ నిధులను సిద్దిపేట,సిరిసిల్లా,గజ్వేల్ కు తరలిస్తే బాల్క సుమన్ ఎందుకు అడ్డుకోలేదు. ఎంపీ,ఎమ్మెల్యేగా పదేండ్లు కొనసాగిన బాల్క సుమన్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ది శూన్యం. భీమారం–చెన్నూరు మధ్య నేషనల్ హైవే 63లోని జోడువాగుల వద్ద కొత్త రోడ్డు కోసం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, తాను కలిసి రూ.100కోట్ల నిధులు మంజూరు చేయించాం.చెన్నూరులో అటవీ శాఖ అనుమతులు లేక రోడ్లు అభివృద్ధి జరగడం లేదు.. కేంద్ర అటవీ శాఖ పర్మిషన్లు తీసుకురావడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తున్న. బీఆర్ఎస్ హయంలో కేసీఆర్ చిన్న కొడుకునని చెప్పుకుని తిరిగిన బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గంలో భూ దందాలు, ఇసుక మాఫియా అక్రమ దందాలతో కోట్లు సంపాదించారు’. అని ఆరోపించారు.
